పెట్రోల్, డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వం అలర్ట్ ..
ఏపీలో (Andhra Pradesh) ఇటీవల పెట్రోల్ , డీజిల్ కొరత (Petrol Diesel Shortage) కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇంధనం కోసం వాహనదారులు దీర్ఘ క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రభావితమవడంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
ఈ పరిస్థితిని గమనించిన కూటమి ప్రభుత్వం (Coalition Government) వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రంగంలోకి దిగి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై ఉన్నతాధికారులు , ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24 గంటల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆయన గట్టిగా సూచించారు. సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలను కూడా హెచ్చరించారు.
అధికారుల వివరాల ప్రకారం, సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సుమారు 6,330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఇటీవల అకస్మాత్తుగా డిమాండ్ 34 శాతం పెరిగి 8,489 కిలోలీటర్లకు చేరుకుంది. డీజిల్ వినియోగం కూడా అదే విధంగా పెరగడంతో సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు కొన్ని ప్రైవేట్ ఆయిల్ సంస్థలు తమ బంకులకు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది.
రిటైల్ ఔట్లెట్లకు గతంలో ఉన్న క్రెడిట్ విధానం నిలిపివేయడం వల్ల కూడా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు హెచ్పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ప్రతి పెట్రోల్ బంక్ వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ ,పోలీస్ శాఖల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగాలని, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు పూర్తిగా అరికట్టాలని చెప్పారు. ఎక్కడా “నో స్టాక్” బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణతో పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా వ్యవస్థను పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








