తిరుపతి చిన్నారుల ఆసుపత్రిపై హెలిప్యాడ్.. పనులపై జేఈవో కీలక సమీక్ష..!
తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతీ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై టీటీడీ(TTD) జేఈవో (వైద్యం & విద్య) డాక్టర్ ఎ. శరత్ కీలక సమీక్ష నిర్వహించారు. శుక్రవారం అధికారులతో కలిసి ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యత తగ్గకుండా ఉండేందుకు జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి అంతస్తులోనూ ఒక గదిని మోడల్ యూనిట్ గా ముందుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆ గదిలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీతో పాటు వైద్య పరికరాల అమరిక ఎలా ఉండాలో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ మోడల్ యూనిట్‌ను బేస్‌గా చేసుకుని మిగిలిన అన్ని గదుల్లోనూ అత్యాధునిక మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణంలో ఇంజనీరింగ్ మరియు వైద్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో పేర్కొన్నారు.
“రోగి సేవలకు అవసరమైన మెడికల్ సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాలి. అవసరమైతే దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయండి” అని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి భవనం పై అంతస్తులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను జేఈవో పరిశీలించారు. అత్యవసర స్థితిలో ఉన్న చిన్నపిల్లలను విమాన మార్గం ద్వారా తీసుకువచ్చేందుకు ఈ హెలిప్యాడ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 6 అంతస్తుల భవన నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ఇవి కూడా చదవండి








