షార్ట్‌కట్ అని అడ్డదారిలో వెళ్తున్నారా? అయితే మీపై క్రిమినల్ కేసే
ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని కాస్త దూరం తగ్గించుకోవడానికి అడ్డదారిలో బండి నడిపితే ఇకపై నేరుగా కెమెరా కంటికి చిక్కాల్సిందే. నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ విభాగం పూర్తిగా సిద్ధమైంది. అడ్డదారిలో వెళ్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే క్షణాల వ్యవధిలోనే మొబైల్‌కు ఈ-చలానా సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పదేపదే ఇలాంటి తప్పులకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా పోలీసులు వెనుకాడటం లేదు.
100 ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు..
నగరవ్యాప్తంగా వాహనదారులు అడ్డదారిలో ప్రయాణిస్తున్నట్లు సుమారు 200కు పైగా ప్రాంతాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీటిలో అత్యంత ప్రధానమైన 100 మార్గాల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని ఈ కెమెరాల ద్వారా గుర్తించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నేరుగా జరిమానాలు విధిస్తున్నారు.
ప్రాణాలను పణంగా..
ఎలాగైనా వెంటనే గమ్యస్థానానికి చేరాలనే తొందరతో వాహనదారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ సంవత్సరం కేవలం 5 నెలల వ్యవధిలోనే రాంగ్‌రూట్ ప్రయాణాల వల్ల 50కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కుటుంబానికి ఆధారమైన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఉదయం, రాత్రి వేళల్లో రోడ్లు ఖాళీగా ఉంటాయని, పోలీసులు ఉండరనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
వద్దంటే వినరు..
ఎదురుగా వాహనాలు వేగంగా దూసుకొస్తున్నా వినకుండా అడ్డదారిలో వచ్చే వాహనదారులు, పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు రకరకాల సాకులు చెబుతున్నారు. చుట్టూ తిరిగి రావడం ఇబ్బందని, కొద్ది దూరమే కదా వచ్చామంటూ మాయమాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరైతే అడ్డదారిలో రావడమే కాకుండా పోలీసులతో గొడవకు దిగుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై ప్రతి నెల నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా (20 మందిపై కేసులు నమోదైతే అందులో 10 మంది) రాంగ్ సైడ్‌లో వచ్చే వాహనదారులే ఉంటుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నంబర్ ప్లేట్లను తొలగించడం..
మలుపులు దూరంగా ఉన్నాయని కాలనీల్లోకి వెళ్లేందుకు రాంగ్సైడ్ను ఎంచుకునే వాహనదారులు, ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను తొలగించడం లేదా మార్చడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. నగరంలో కేవలం ఒక నెల వ్యవధిలోనే రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై 30 ప్రాంతాల్లోనే ఏకంగా 2 లక్షలకు పైగా ఈ-చలానాలు నమోదు కావడం ఈ ఉల్లంఘనల తీవ్రతను నిరూపిస్తోంది.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో..
నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న ప్రాంతాలుగా షేక్‌పేట్, ఫిలింనగర్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, టోలిచౌకి, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, అత్తాపూర్, చార్మినార్, అబిడ్స్, నారాయణగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్‌పేట్, రాణిగంజ్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, సుల్తాన్‌బజార్ వంటి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రదేశాలలో అడ్డదారి ప్రయాణాల వల్ల తరచూ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.








