LPG: గ్యాస్ సరఫరాపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..!
పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధం కారణంగా, రాష్ట్రంలో నెలకొన్న.. గ్యాస్ (LPG)సరఫరాలో అపోహలు, ఆందోళలకు తావివ్వొద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాసేపటి క్రితం గ్యాస్ సరఫరాపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీల్లో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసారు. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయాలని, ప్రజల్లో నెలకొన్న అనవసర అపోహలు, భయాలను పారద్రోలేలా పని చేయాలని ఆదేశించారు. వాణిజ్య అవసరాలకు సంబంధించిన గ్యాస్ సరఫరాను కూడా ప్రాధాన్యత ప్రకారం ఇబ్బంది లేకుండా అందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
ఆయిల్ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో రోజువారీ గ్యాస్ బుకింగ్ లు, నిల్వలు, డెలివరీలపై గత వారం రోజుల నివేదిక వివరాలను మంత్రికి వివరించారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసారు.
దీనివల్ల ప్రజల్లో అపోహలు, ఆందోళనలు ఎక్కువవుతున్నాయన్నారు. గత వారం రోజుల్లో ఇలాంటి అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ జరిగాయని, రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసారు. ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఆస్పత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, అత్యవసర సర్వీసులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ వాణిజ్య అవసరాల గ్యాస్ ను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేసారు.
క్రమంగా గ్యాస్ సరఫరా మరింత మెరుగయ్యేలా ప్రణాళికాబద్ధంగా సమష్టిగా పనిచేయాలన్నారు. జిల్లాస్థాయిలోనూ జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని పని చేయాలని పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా సప్లై చైన్ బ్రేక్ కాకుండా చూసుకోవాలి. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ పక్కదారి పట్టకుండా చూసుకోవల్సిన బాధ్యతను క్షేత్రస్థాయిలో సమర్దంగా చేపట్టాలని ఆదేశించారు. అప్పుడే క్షేత్రస్థాయిలో పరిస్థితి క్రమపద్దతిలో వెళ్తుంది. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సరఫరా తేదీని సైతం ఏజెన్సీల నిర్వాహకులు ఫొన్ లో స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి







