Russia: రష్యా – ఇరాన్ పై ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు..!
అమెరికా-ఇరాన్(America – Iran) యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin), ఇరాన్ అగ్రనేతల మధ్య ఉన్న బంధం ఇప్పుడు ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందా? అవుననే అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా, ఇరాన్ మధ్య ఉన్న రహస్య ఒప్పందాలను బయటపెడుతూ ఆయన సంచలన కామెంట్స్ చేసారు. ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టడానికి రష్యా తన గూఢచారి సమాచారాన్ని (Intelligence) ఇరాన్‌కు ధారపోస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి
దీనికి సంబంధించి తన వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఆయన ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా మరియు మిత్రదేశాల కదలికలను రష్యా తన శాటిలైట్లు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆ సమాచారాన్ని ఇరాన్‌కు(Iran) చేరవేస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ క్షిపణులు ఎప్పుడు వస్తాయి? ఎక్కడ దాడి చేస్తాయి? అనే కీలక సమాచారాన్ని రష్యా ముందే ఇరాన్‌కు ఇస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లను(Iran Drone) రష్యా వాడుకున్నందుకు ప్రతిఫలంగా, ఇప్పుడు ఇరాన్‌కు రష్యా సాంకేతిక మరియు గూఢచారి సాయం అందిస్తోందని ఆయన వివరించారు.
తమ ఇంటెలిజెన్స్ వర్గాలు రష్యా-ఇరాన్ మధ్య జరిగిన రహస్య సమాచార మార్పిడికి సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు, శాటిలైట్ డేటాను సేకరించాయని జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలకు పంపినట్లు ఆయన వెల్లడించారు. రష్యా ఇక్కడ ఉక్రెయిన్ను నాశనం చేస్తూనే, అక్కడ ఇరాన్‌ను ఉసిగొల్పి ప్రపంచ యుద్ధానికి బాటలు వేస్తోంది అని ఆయన మండిపడ్డారు. జెలెన్స్కీ ఆరోపణలపై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ రష్యా నిజంగానే ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తుంటే, అది అమెరికా సైనికుల ప్రాణాలకు నేరుగా ముప్పు కలిగిస్తుందని పెంటగాన్ హెచ్చరించింది. అయితే, రష్యా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అమెరికా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఉక్రెయిన్ ద్వారా ఇలాంటి ‘ఫేక్’ ఆరోపణలు చేయిస్తోందని రష్యా మీడియా పేర్కొంటోంది.
ఇవి కూడా చదవండి








