మా బంధం వెరీ స్ట్రాంగ్.. మోడీ గట్టి లీడరన్న పుతిన్..!
అమెరికా, యూరప్ తో భారత్ బంధం పెరుగుతున్న వేళ.. రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ -రష్యా బంధం .. ఈనాటిది కాదన్నారు.దశాబ్దాలుగా మిత్రత్వంతో ముందుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నాడు నెహ్రూ కాలం నుంచి ఇప్పుడు మోడీ వరకూ అందరు ప్రధానులు.. తమ దేశం, ప్రజలతో ఎంతో సన్నిహితంగా మెలిగారన్నారు పుతిన్.
అమెరికాతో భారత్ సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్తో తమకున్న సంబంధాలు తగ్గిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్రమోడీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేయడం వ్యర్థమని, అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. గురువారం సెయింట్పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తాసంస్థల అధినేతలతో ఆయన మాట్లాడారు.
‘‘భారత్ మాకు విశ్వసనీయ భాగస్వామి. వేరే ఏ దేశంతో అది ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినా దానిలో మేం ఎలాంటి ప్రతికూల పరిణామాలు చూడబోం. కాలపరీక్షను తట్టుకుని నిలిచిన భారత్-రష్యా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం పడదు. భారత్కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. తమ దేశ ప్రయోజనాలకు ముఖ్యమని అనుకున్న అన్ని దేశాలతో అది సంబంధాలు పెంపొందించుకుంటోంది అని గుర్తు చేశారు..
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. బలమైన స్థాయిలో ఆకట్టుకునే రీతిలో వృద్ధి సాధిస్తోంది. ఇది ఆయాచితంగా వచ్చిందేమీ కాదు. మోడీ నేతృత్వంలోని సర్కారు కష్టపడి చేస్తున్న పనికి ఫలితం ఇది. రాబోయే ఏళ్లలో భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించి, 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నాను. భారత్ గొప్పదేశం. అక్కడి ప్రజాస్వామ్యం గొప్పది’’ అని పుతిన్ చెప్పారు.








