భారత్ కు రష్యా బిగ్ ఆఫర్..సంయుక్తంగా ఎస్‌యూ-57 తయారు చేద్దామని ప్రతిపాదన..!
Russia-India relation:
దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థకు అండగా నిలిచిన ఆప్తకాల మిత్రదేశం రష్యా.. మరోసారి తన ఆత్మీయ నేస్తానికి బిగ్ ఆఫర్ ప్రకటించింది. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసుకునే దిశగా.. ఐదోతరం యుద్ధ విమానాన్ని కలిసి అభివృద్ధి చేద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఆఫర్ ఇచ్చారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ ఎస్‌యూ-57 యుద్ధ విమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని వెల్లడించారు. సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తాసంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యక్షుడు ఈ ప్రతిపాదన చేశారు.
భారత వైమానిక దళంలో ఐదోతరం యుద్ధ విమానాలు లేవు. మరోవైపు, పాకిస్థాన్ (Pakistan) త్వరలో చైనాకు చెందిన షెన్యాంగ్ జె-35AE స్టెల్త్ ఫైటర్స్‌ను సొంతం చేసుకోనుందని వార్తలు వస్తోన్న వేళ రష్యా నుంచి స్పందన రావడం గమనార్హం. రక్షణరంగంలో తమ రెండు దేశాల మధ్య ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పిన పుతిన్.. పరోక్షంగా పాశ్చాత్య దేశాలకు చురకలు అంటించారు. ఆ దేశాలు సాంకేతికతను బదిలీ చేసేందుకు పలు ఆంక్షలు విధిస్తుంటాయని గుర్తుచేశారు.
అయితే సు-57 ఫైటర్ జెట్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రష్యా (Russia) గతంలోనే భారత్‌కు అవకాశం ఇచ్చింది. 2018లోనే ఆ చర్చలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అయితే భారత్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ యుద్ధ విమానంతో పూర్తిస్థాయి కార్యాచరణ అవసరాలు తీరవని ఐఏఎఫ్ నిర్ధరించడంతో భారత్ వెనక్కి తగ్గింది. ఇదిలాఉంటే.. స్వదేశీ పరిజ్ఞానంతో ఐదోతరం జెట్‌ను తయారు చేసేందుకు భారత్ చేపట్టిన ‘అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్’ (ఆమ్కా) ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2030 మధ్యలో వైమానిక దళంలో చేరొచ్చని తెలుస్తోంది.








