వెనెజువెలాలో కీలుబొమ్మ సర్కార్.. మచాడో ఆందోళన..!
వెనెజువెలాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి అధ్యక్షుడు మదురో దంపతులను ఎత్తుకొచ్చిన అమెరికా.. ఇప్పుడక్కడ తమకు అనుకూలమైన కీలుబొమ్మ సర్కార్ ను నిలబెట్టింది. తాము అనుకున్న విధంగా అక్కడి చమురును కొల్లగొడుతోంది. అది సరే.. మరి వెనెజువెలా ప్రజలపరిస్థితి ఏంటి..? వారి భవిష్యత్తును ఏవిధంగా అమెరికా ముందుకు తీసుకెళ్లనుంది. మూడు నెలలు దాటినా.. ఈ ప్రశ్నలకు అమెరికా దగ్గర, కీలుబొమ్మ సర్కార్ దగ్గరా ఎలాంటి రోడ్ మ్యాప్ లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
రాజ్యాంగ సంక్షోభం దిశగా..
నికోలస్ మదురోను అమెరికాకు తరలించి మూడు నెలలు దాటినా, ఇప్పటికీ వెనెజువెలాలో స్పష్టమైన నాయకత్వం లేదు. పాత ప్రభుత్వంతో సంబంధం ఉన్న తాత్కాలిక అధికారులే పాలన సాగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారికి ప్రజల తీర్పు లేదని, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా మాత్రమే దేశంలో చట్టబద్ధమైన పాలన నెలకొంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. పారదర్శకమైన అధికార బదిలీకి రోడ్‌మ్యాప్ లేకపోవడంతో వెనెజువెలాలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి
30 రోజుల్లోగా ఎన్నికలు..?
వెనెజువెలా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానం శాశ్వతంగా ఖాళీ అయితే 30 రోజుల్లోగా తిరిగి ఎన్నికలు జరగాలి. కానీ ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన విశ్లేషణలు, రాజకీయ మంతనాలు ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఎప్పటినుంచో రాజీలేని పోరాటం చేస్తున్న మచాడో… తాజా పరిస్థితుల నేపథ్యంలో తన గళాన్ని మరింత పెంచారు. నాయకత్వ లేమిని భర్తీ చేసే ఏకైక మార్గం తక్షణ ఎన్నికలేనని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అంతర్గత రాజకీయ విభేదాలకు తోడు, అంతర్జాతీయ ఒత్తిళ్లు కూడా వెనెజువెలా ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మదురో ఆధిపత్యం అనంతరం చట్టబద్ధమైన పాలన కోసం జరుగుతున్న ఈ పోరాటం… వెనెజువెలా భవిష్యత్తును నిర్ణయించే ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది.
ఇవి కూడా చదవండి








