Crude Oil: ట్రంప్ ప్రకటన.. ప్రపంచ మార్కెట్లో చల్లారిన చమురు సెగ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇరాన్(Iran) విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించగానే, ఆకాశాన్నంటుతున్న ముడిచమురు ధరలు నేలచూపులు చూశాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు మొగ్గు చూపుతూ, దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. ఈ అనూహ్య పరిణామంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 13 శాతం మేర పడిపోయింది.
గత కొద్దిరోజులుగా ఇరాన్ చమురు నిల్వలు తగ్గడమే కాకుండా, విద్యుత్ కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేస్తుందనే భయంతో చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటేశాయి. అయితే, సోమవారం ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లకు ఊపిరి పోసింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నాయి, అందుకే 5 రోజుల పాటు దాడులు ఉండవని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయాయి. ఒకే రోజులో 13 శాతం ధర తగ్గడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.
ఈ ప్రభావం భారత్ పై కూడా పడే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వల్ల దేశీయంగా మనకు పెద్ద ఊరట లభించనుంది. ముడిచమురు ధరలు ఇలాగే స్థిరంగా తగ్గితే, త్వరలోనే దేశీయంగా పెట్రోల్(Petrol Price), డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 నుండి రూ. 8 వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు దిగుమతి బిల్లు తగ్గడం వల్ల డాలర్‌తో పోలిస్తే కుప్పకూలుతున్న రూపాయి విలువ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది.
రవాణా ఖర్చులు తగ్గడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందనే చెప్పాలి. ట్రంప్ పెట్టిన 5 రోజుల గడువు ముగిసిన తర్వాత ఇరాన్ గనుక అమెరికా షరతులకు లొంగకపోతే, మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. అప్పుడు ధరలు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రస్తుతానికి ఈ 13 శాతం తగ్గుదల అనేది మార్కెట్లకు ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








