బీబీ కాస్త జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ క్లాస్…..!
ఇరాన్ యుద్ధం విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. స్మూత్ వార్నింగిచ్చారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. ఓ విధంగా చెప్పాలంటే ఇండైరెక్టుగా హెచ్చరించారు కూడా. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
బీరుట్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో టెల్‌అవీవ్‌పై టెహ్రాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈక్రమంలో ఇరుదేశాల మధ్య భీకర పోరు కొనసాగింది. ఇంతలో ట్రంప్ కలుగజేసుకొని.. ప్రతీకార దాడులు చేయొద్దని నెతన్యాహు (Benjamin Netanyahu)ను కోరారు. ఆ సమయంలో ‘బీబీ.. మీరు జాగ్రత్తగా ఉండండి’ అని తాను నెతన్యాహుతో అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే.. ఇజ్రాయెల్ (Israel) ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు.
పశ్చిమాసియాలో ఘర్షణలు తిరిగి మొదలైతే.. ఇరాన్‌తో దౌత్య ఒప్పందం కుదుర్చుకోవాలనే తన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దాడుల నేపథ్యంలో నెతన్యాహుపై ఒత్తిడి తేవాలని పలు దేశాలు తనను కోరినట్లు ట్రంప్ తెలిపారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులను పరిమితం చేసేందుకు తాను ప్రయత్నించినట్లు వెల్లడించారు.
ట్రంప్‌తో ఫోన్ కాల్లో.. ఇరాన్ నుంచి మరిన్ని దాడులు జరగవని హామీ ఇస్తే తప్పా, తాము వెనక్కి తగ్గమని నెతన్యాహు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే.. తాము ఘర్షణకు దిగమని ఇరాన్ అధికారులు మధ్యవర్తుల ద్వారా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇరుదేశాల మధ్య పోరుకు బ్రేక్ పడింది. ఇక, సోమవారం జరిగిన పోరులో అమెరికా సైన్యం పాల్గొనలేదు. అయినప్పటికీ.. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ బలగాలకు సాయం అందించినట్లు యూఎస్ రక్షణ అధికారులు తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ స్పందించారు. ఇరువురి నేతల మధ్య సంభాషణలు బాగా జరిగాయని.. కొన్ని పత్రికలు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్ని చిన్న గొడవలు జరుగుతాయి. అప్పుడప్పుడు సంభాషణలు ఉద్రిక్తతలుగా మారొచ్చు’ అని మీడియాతో అన్నారు. ట్రంప్ అభ్యర్థన మేరకు సైనిక చర్య విషయంలో నెతన్యాహు తగ్గారన్నారు. అయితే దాడులకు ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయం ట్రంప్‌నకు కూడా తెలుసన్నారు.








