మొజ్తబాతో భేటీకి సిద్ధం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ కీలక ఆయువుపట్లపై దాడులు చేస్తుంటే…. టెహ్రాన్ అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ పై విరుచుకుపడుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు. పరిస్థితులు అనుకూలిస్తే ఏదో ఒక సమయంలో ఆయన్ను కలవాలనుకుంటున్నానన్నారు ట్రంప్.
అయితే, మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, మధ్యవర్తుల ద్వారా, రాతపూర్వకంగా పరిపాలనలో పాల్గొంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు. పాలనాపరమైన నిర్ణయాలకు మొజ్తబా ఆమోదం తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
మంగళవారం సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో సాక్ష్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మోజ్తబా ఖమేనీ నిర్ణయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయితే అన్ని సంప్రదింపులు కేవలం రాతపూర్వకంగా, మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి” అని వివరించారు.
గత ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణానంతరం మొజ్తబా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ సైతం ఇటీవల మాట్లాడుతూ సుప్రీం లీడర్ అనుమతి లేకుండా దేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు జరగవని పేర్కొన్నారు.








