Sasikala: పార్టీ పేరు, జెండా చెప్పేసిన శశికళ .. అన్నాడీఎంకే లక్ష్యంగా వ్యూహం!
తమిళనాడు రాజకీయాల్లో ‘చిన్నమ్మ’గా పిలువబడే వి.కె.శశికళ (Sasikala)తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా, అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించిన శశికళ, తాజాగా కొత్త పార్టీ పెట్టారు. “ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం” (AIPTMMK) పేరుతో రాజకీయ పార్టీని పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రామనాథపురం జిల్లాలోని కముదిలో జయలలిత జయంతి సందర్భంగా శశికళ ఈ ప్రకటన చేశారు.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో తలెత్తిన అంతర్గత విభేదాలు, అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవించడం వంటి పరిణామాలు ఆమెను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె అన్నాడీఎంకేను తిరిగి తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి, వివిధ వర్గాలను ఏకం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గం ఆమెను పార్టీలోకి చేర్చుకోవడానికి ససేమిరా అనడంతో, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె తన సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK) పేరుతో పార్టీ ప్రకటించారు. పార్టీ జెండాపై అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను పొందుపరిచారు. పార్టీ గుర్తుగా “కొబ్బరి తోట”ను ఎంచుకున్నారు. ఇది ఐక్యతకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతీక అని ఆమె అభివర్ణించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతానని చెప్పారు.
ఇవి కూడా చదవండి
శశికళ ప్రధానంగా అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకుపై కన్నేశారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న ‘తేవర్’ సామాజిక వర్గం మద్దతు ఆమెకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇది ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు పెద్ద దెబ్బగా మారవచ్చు. ఓట్లు చీలిపోవడం వల్ల అంతిమంగా అధికార పక్షం డీఎంకేకు ప్రయోజనం చేకూరే ప్రమాదం ఉంది. పార్టీ ప్రకటన సందర్భంగా శశికళ ఎడప్పాడి పళనిస్వామిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రిని చేసిన వ్యక్తి (EPS) తనకే వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు.
తన పార్టీ పేరులో ఎంజీఆర్ బిరుదు ‘పురట్చి తలైవర్’ చేర్చడం ద్వారా తాను అసలైన వారసురాలినని నిరూపించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉన్న అసంతృప్త నేతలను, కార్యకర్తలను తనవైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో శశికళ 2027 వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ, ఆమె పార్టీని నడిపిస్తూ కింగ్ మేకర్ పాత్ర పోషించాలని చూస్తున్నారు.
శశికళ కొత్త పార్టీ ఆవిర్భావం తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ చీలికను సూచిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే మూడు, నాలుగు ముక్కలుగా విడిపోయి ఉన్న తరుణంలో, ‘చిన్నమ్మ’ పార్టీ కార్యకర్తలను ఏ మేరకు ఆకర్షించగలదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఆమె గణనీయమైన స్థాయిలో ఓట్లను చీల్చగలిగితే, 2026 ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారవచ్చు. తమిళనాట ద్రవిడ రాజకీయాలు ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్న కొత్త దశకు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి








