Tamilnadu: జయలలితను సీఎం చేస్తానని నాడే శపథం చేశా: శశికళ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తాజాగా రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి ఆమె మరణం వరకు జరిగిన అనేక నాటకీయ పరిణామాలను శశికళ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు. ముఖ్యంగా 1987లో జరిగిన ఒక సంఘటన తనను రాజకీయాల వైపు నడిపించిందని ఆమె పేర్కొన్నారు.
అవమానం నుండి పుట్టిన శపథం
1987లో ఏఐఏడీఎంకే ఫౌండర్ ఎంజీఆర్ అంత్యక్రియల సమయంలో జయలలితకు తీవ్ర అవమానం జరిగిందని శశికళ గుర్తు చేసుకున్నారు. ఎంజీఆర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన జయలలితను ఆర్.ఎం. వీరప్పన్ మద్దతుదారులు వాహనం పైనుంచి కిందకు నెట్టేశారని, ఆ సమయంలో తాను ఆమెను పట్టుకుని ఆదుకున్నానని చెప్పారు. ఆ క్షణమే, అవమానించిన వారి ముందే జయలలితను ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని తాను శపథం చేసినట్లు వెల్లడించారు. రాజకీయాలు వద్దని జయలలిత వెనకడుగు వేసినా, ధైర్యం చెప్పి ఆమెను నడిపించానని శశికళ తెలిపారు.

మరణంపై ఆరోపణలు.. పదవిపై క్లారిటీ
2016లో జయలలిత అనారోగ్యం, మరణం చుట్టూ అల్లుకున్న వివాదాలపై శశికళ స్పందించారు. 72 రోజుల చికిత్స తర్వాత కోలుకుంటున్న సమయంలో ఊహించని విధంగా గుండెపోటు వచ్చిందని, ఆమె మరణానికి తానే కారణమంటూ జరిగిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జయలలిత మరణించిన రాత్రే మంత్రులు తనను సీఎం కావాలని కోరినా, అంత్యక్రియలకే ప్రాధాన్యత ఇచ్చి పన్నీర్‌సెల్వంను పదవిలో కొనసాగనిచ్చానని స్పష్టం చేశారు.
పన్నీర్‌సెల్వం, పళనిసామిల నియామకం వెనుక..
పన్నీర్‌సెల్వం పాలనపై ఫిర్యాదులు రావడంతోనే తాను బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యానని, ఆ నిర్ణయం ఆయనకు తెలిసే జరిగిందని శశికళ పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ‘ధర్మయుద్ధం’ పేరిట తిరుగుబాటు చేయడం ఆయనకే నష్టమని వ్యాఖ్యానించారు. చివరగా, కోర్టు తీర్పు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోకూడదనే ఉద్దేశంతోనే పళనిసామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తాను జైలుకు వెళ్లానని శశికళ వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








