Dubai: దుబాయ్ పై ఆగని దాడులు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉండటంతో.. రోజు రోజుకి గల్ఫ్ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి కీలక నగరమైన దుబాయ్.. వరుస దాడులతో దద్దరిల్లుతోంది. నేడు కూడా దుబాయ్‌పై డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం దుబాయ్ సెంట్రల్ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, భవనాలు ఒక్కసారిగా కంపించాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు రాసాయి. ఈ ఘటనతో నగరంలోని ఆకాశంలో పొగ మేఘాలు కమ్ముకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.
సెంట్రల్ దుబాయ్‌లోని ఒక భవనంపై క్షిపణి శకలాలు పడటంతో భవనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు దుబాయ్ మీడియా ధృవీకరించింది. యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) ఇరాన్ నుండి వచ్చిన 10 బాలిస్టిక్ క్షిపణులను, 26 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయని అక్కడి మీడియా ప్రకటించింది. ఈ క్రమంలోనే గగనతలంలో పేలుళ్లు సంభవించి శకలాలు కిందకు పడ్డాయి. ముఖ్యంగా షేక్ జాయెద్ రోడ్, డౌన్‌టౌన్ దుబాయ్ సమీపంలోని భవనాలపై ఈ శకలాలు పడినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
అయితే, తాజా దాడుల్లో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. గత 48 గంటల్లో దుబాయ్ పై మోస్తరు దాడులు జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. గురువారం అర్ధరాత్రి ఒక డ్రోన్ నివాస భవనాన్ని ఢీకొనడంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. అంతకుముందు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(Dubai Airport) సమీపంలో జరిగిన డ్రోన్ దాడుల్లో ఒక భారతీయుడితో సహా నలుగురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నిరంతర దాడుల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయాల్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ వంటి ఎయిర్‌లైన్స్ పరిమితంగా మాత్రమే సర్వీసులను నడుపుతున్నాయి. కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని అధికారులు సూచిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మొబైల్ అలర్ట్ ల వార్నింగ్ మెసేజ్ లు పంపుతోంది.
ఇవి కూడా చదవండి








