హిమాలయాల సానువుల్లో ‘‘జొజిలా సొరంగం’’.. రికార్డు సృష్టించిన భారత్
భారత్ – చైనా సరిహద్దు సమీపంలో భారత సైన్యం సరికొత్త రికార్డును సృష్టించింది. కాశ్మీర్ – లడఖ్ ప్రాంతాలను కలిపే ‘‘జొజిలా సొరంగ’’ నిర్మాణాన్ని పూర్తి చేసింది సైన్యం. నిత్యం దట్టమైన మంచుతో కప్పి వుండే హిమాలయాల సానువుల మధ్యలో దీనిని నిర్మించారు. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.దేశ భద్రతలో కీలకమైంది ఈ సొరంగం. జమ్మూ కాశ్మీర్ – లద్దాఖ్ ను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాలకు వీలు కలుగుతుంది.
ఎముకలు కొరికే చలి, 100 రోజుల పాటు మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 30 డిగ్రీల మధ్య తీవ్రమైన చల్లటి వాతావరణం వుంటుంది. ఇంతటి చల్లటి వాతావరణాన్ని, మంచు తుపానులను తట్టుకొని మరీ, ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఒకే గొట్టం కలిగిన, ఎత్తైన ప్రదేశంలో ఉన్న, రెండు వైపులా రాకపోకలు సాగించే రహదారి సొరంగం ఇదీ.
సాధారణంగా మనం ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా వుంటుంది. కానీ అసాధారణంగా ఒకే సొరంగంలో రెండు వైపులా రాకపోకలు సాగించేలా జోజిలాను నిర్మించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధ చంద్రాకారంలో దీనిని రూపొందించారు. హిమాలయాల ప్రాంతం కాబట్టి, ప్రయాణం చేస్తున్న కొద్దీ, వాతావరణం మారిపోతూ వుంటుంది. అయితే.. ఈ సొరంగాన్ని ఆస్ట్రియన్ టన్నెలింగ్ విధానంలో, సున్నితమైన పొరలను కూడా తొలిచి, షాట్ క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి రక్షణ చర్యలు, సాంకేతికంగా అంచనా వేస్తూ, దీనిని నిర్మించారు.
పర్యాటకాన్ని ఆకర్షించే విధంగా…
1. కాశ్మీర్ – లద్దాఖ్ మార్గంలో సోన్ మార్క్ సమీపంలోని బాల్తాల్ నుంచి మీనమార్గ్ ప్రాంతం వరకూ జోజిలా అనుసంధానమై వుంటుంది.
2. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, సొరంగాలు, వంతెలనతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లు. జోజి లా 13.15 కి.మీ. పొడవు వుంటుంది.
3. సొరంగం మధ్యలో 460 మీటర్ల పొడవుతో మూడు వంతెనలు కూడా నిర్మించారు. మంచు తుపానుల సమయంలో రక్షణ కోసం 7 కృత్రిమ సొరంగాలు కూడా నిర్మించారు.








