Arunachal Pradesh: ఆపరేషన్ పసిఫిక్.. హిమాలయాల్లో ఎయిర్ ఫోర్స్ పోరాటం..!
సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తున.. దట్టమైన అటవీప్రాంతం.. కార్చిచ్చు దహిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ వ్యాలీ పెద్దఎత్తున మంటలు, పొగతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలోని ఈ అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు ల్యాండ్ ఆపరేషన్ అసాధ్యంగా మారడంతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఏరియల్ ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తోంది.
అత్యంత కఠిన పరిస్థితుల్లో గాలి పీడనం తక్కువగా ఉన్నప్పటికీ… మంటలు ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఐఏఎఫ్‌కు చెందిన Mi-17V5 హెలికాప్టర్లు సుమారు 12 వేల లీటర్ల నీటిని మంటలపై కుమ్మరించి కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. అయితే కఠిన పరిస్థితులు, ప్రతికూల వాతావరణం వీరికి సమస్యలు తెచ్చిపెడుతోంది.
నాగాలాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ‘జుకో వ్యాలీ’లో సైతం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడ ట్రెకింగ్ కోసం వెళ్లిన 30 మంది పర్యాటకులు మంటల మధ్య చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ, ఇండియన్ ఆర్మీ, స్థానిక ‘సదరన్ అంగామీ యూత్ ఆర్గనైజేషన్’ వాలంటీర్లు … మెరుపు వేగంతో స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతానికి జుకో వ్యాలీలోకి ట్రెక్కర్ల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు.
లోహిత్ వ్యాలీలో మంటలు గ్రామాల వైపు రాకుండా ఆర్మీ జవాన్లు ‘ఫైర్ లైన్స్’ (మంటలు వ్యాపించకుండా అడవిలో ఖాళీ ప్రదేశాలను సృష్టించడం) ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సంపదతో పాటు అరుదైన వన్యప్రాణులను కాపాడటమే లక్ష్యంగా గాలిలో ఎయిర్ ఫోర్స్, భూమిపై ఆర్మీ సమన్వయంతో పనిచేస్తున్నాయి.






