Rahul Gandhi: శశిథరూర్ ను కూల్ చేసిన రాహుల్..?
కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. బిజెపి(BJP)లో చేరే అంశంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్తో సంబంధాలు సన్నగిల్లాయి. అలాగే పార్టీ కీలక సమావేశాలకు దూరం కావడం పట్ల కూడా పార్టీలో పెద్ద చర్చే జరిగింది. ఈ తరుణంలో గురువారం ఉదయం, పార్లమెంట్(Budget Session) లో పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీలతో 90 నిమిషాల పాటు సమావేశమయ్యారు ఈ ఎంపీ.
దీనిపై మాట్లాడిన శశి థరూర్.. తమ మధ్య చాలా నిర్మాణాత్మక చర్చ జరిగిందని, అంతా పాజిటివ్ గా ఉందన్నారు. తాము అందరూ ఒకటే ఎజండాతో పని చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తన అభిప్రాయాలను పార్టీ అధిష్టానంతో పంచుకున్నట్టు చెప్పుకొచ్చారు. తన ఫిర్యాదులను పార్టీ అధిష్టానం పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. గత ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత థరూర్ కాంగ్రెస్ తో సంబంధాలు బాగా క్షీణించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
సంక్షోభ సమయంలో.. ప్రధాని అనుసరించిన వైఖరిపై ఆయన ప్రసంశలు కురిపించారు. అక్కడి నుంచి ఆయన కమలం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాతి పరిణామాలను భారత్ తో సన్నిహితంగా ఉండే దేశాలకు వివరించేందుకు కేంద్రం పలు పార్టీల నేతలను ఆహ్వానించింది. అందులో శశి థరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో ఏ నేతకు ఆహ్వానం అందలేదు. దీనితో కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వెళ్తున్నారని కథనాలు వెలువడ్డాయి.
నవంబర్లో జరిగిన రెండు సంఘటనలతో సహా, ఆ తర్వాతి పరిణామాలతో సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ప్రధాని ప్రసంగించే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరై దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేసారు. నవంబర్లో రెండవసారి ‘భారత రాజకీయాలు ఒక కుటుంబ వ్యాపారం’ అనే శీర్షికతో వచ్చిన వ్యాసాన్ని ఆయనే రచించారు. గాంధీ కుటుంబాన్ని ఎగతాళి చేస్తూ ఆయన కథనం రాసారని విమర్శలు వచ్చాయి. వాస్తవానికి, 2022 మధ్యకాలం నుండి ఎంపీకి, పార్టీకి మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.






