AP Liquor Scam: చెవిరెడ్డికి బెయిల్.. కెసిరెడ్డికి జైల్..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని నెలలుగా జైలులోనే ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 226 రోజుల సుదీర్ఘ జైలు జీవితం అనంతరం ఆయనకు విముక్తి లభించింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. ప్రత్యేక విచారణ బృందం -సిట్ ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు చేపట్టింది. మద్యం బాటిళ్లపై సిండికేట్ ఏర్పాటు, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చడం, డిజిటల్ పేమెంట్లను కాదని కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరపడం, నాణ్యత లేని మద్యం బ్రాండ్లను ప్రోత్సహించడం… లాంటి అనేక అంశాలను సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని సిట్ అధికారులు అభియోగాలు మోపారు. ఈ క్రమంలోనే గతేడాది జూన్ 17న బెంగళూరులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
చాలా కాలంగా బెయిల్ కోసం చెవిరెడ్డి తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ, దర్యాప్తు కీలక దశలో ఉందన్న పోలీసుల వాదనతో అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే, తాజా విచారణలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని షరతులు విధించింది. నిందితులు తమ పాస్‌పోర్టులను తక్షణమే కోర్టుకు అప్పగించాలని చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని, కేసు విచారణలో భాగంగా పోలీసులు పిలిచినప్పుడు హాజరు కావాలని స్పష్టం చేసింది. సాక్షులను బెదిరించడం లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నాటి నుండి సుమారు ఏడున్నర నెలల పాటు జైలులోనే గడిపారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా వెలుగొందిన ఆయన, ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థాయిలో జైలు శిక్ష అనుభవించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన విడుదల నేపథ్యంలో అనుచరులు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో అందరికీ ఊరట లభించలేదు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ప్రాథమికంగా భావించినట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో, నిధుల మళ్లింపులో వీరి పాత్రపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని సిట్ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లు సమాచారం.
ఈ బెయిల్ నిర్ణయం వైసీపీకి కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వేల కోట్ల రూపాయల స్కామ్ కావడంతో ముందు ముందు సిట్ ఎలాంటి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు, సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్ ఆధారంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.






