Jana Nayagan: కేసు విరమించుకోవాలనే ఆలోచనలో జన నాయగన్ నిర్మాతలు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) రాజకీయాల్లోకి వెళ్లేముందు చేసిన చివరి సినిమాగా జననాయగన్(Jana nayagan) ను మేకర్స్ బాగానే జనాల్లోకి తీసుకెళ్లారు. వాస్తవానికి ఈ సినిమా పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజవాల్సింది. కానీ సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ఈ సినిమా వాయిదా పడి, కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది చెప్పడం కష్టంగా మారింది.
రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ సినిమా రిలీజయ్యేది తమిళనాడులో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయ్యాకే అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడీ సినిమా నిర్మాతలు రిలీజ్ వైపు అడుగులేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కోర్టులో తాము దాఖలు చేసిన కేసును విత్ డ్రా చేసుకోవడానికి కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) డిసైడైనట్టు సమాచారం.
ఇప్పటికే రిలీజ్ బాగా లేటవడంతో, సీబీఎఫ్సీ(CBFC)తో నిర్మాతలు ఒప్పందాన్ని కుదుర్చుకుని, సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వీలైనంత త్వరగా రివైజింగ్ కమిటీని సంప్రదించాలనుకుంటున్నారట. పైగా మూవీని కమిటీకి పంపే ముందు అవసరమైన మార్పులు చేయడానికి కూడా మేకర్స్ అంగీకరించారని తెలుస్తోంది. దీంతో సినిమా త్వరలోనే రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.






