YS Jagan: వైసీపీలో కొత్త పదవి సందడి..!
రాజకీయంగా బలహీనంగా ఉన్న వైసీపీ, ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల్లోకి రాకుండా కేవలం తెర వెనుక రాజకీయం చేస్తున్నారనే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా పార్టీలో కీలక మార్పులు చేసినందుకు కూడా జగన్ అడుగులు వేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు లేని పదవులను కూడా పార్టీలో క్రియేట్ చేసి, పదవులు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు అంటున్నాయి వైసిపి వర్గాలు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 15 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఎవరూ లేరు. పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా వైయస్ విజయమ్మ కొనసాగే వారు. ఇక ఆ తర్వాత కొంతమంది కీలక నాయకులు పార్టీలో నెంబర్ 2 బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉండేది.
అయితే ఇప్పుడు పార్టీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే, పార్టీకి కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా పార్టీ బలోపేతానికి ఇదే సహాయపడుతుందని జగన్ భావిస్తున్నారు. ఇక ఆయనే పార్టీలో కొన్నాళ్ళ పాటు నెంబర్ 2 గా కొనసాగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణా రెడ్డిని జగన్ దూరం పెట్టినట్టు కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి.






