Mumbai: ‘గగన్’ రక్షణ లేకే అజిత్ పవార్ విమాన ప్రమాదమా…?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి విచారణలో సరి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అజిత్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ ‘గగన్’ లేకపోవచ్చని ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానాల్లో ఈ భద్రతా వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలన్న నిబంధనలు అమల్లోకి రావడానికి 28 రోజుల ముందు అజిత్ ప్రయాణించిన విమానం రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ‘గగన్’ గైడెన్స్ సిస్టమ్ అందులో ఉండకపోవచ్చని సమాచారం.
ఏంటీ ‘గగన్’ వ్యవస్థ..?
సాధారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) సాయంతో విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇది భూ ఆధారిత టెక్నాలజీ. దృశ్యస్పష్టత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పైలట్‌కు ల్యాండింగ్ విషయంలో కచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికతను ‘ఇన్విజిబుల్ గ్లైడ్ పాత్’గా పేర్కొంటారు. వర్షం లేదా పొగమంచు కమ్మేసినప్పుడు పైలట్లు సజావుగా రన్‌వేపై దిగడానికి ఇది దోహదపడుతుంది.
ఇది … చాలా ఖర్చుతో కూడుకున్న సాంకేతికత. బారామతి వంటి చిన్న విమానాశ్రయాల్లో ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో చిన్న ఎయిర్‌పోర్టుల కోసం కేంద్రం స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ ఆధారిత గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. గ్రౌండ్ పరికరాలతో అవసరం లేకుండా ఈ గగన్ వ్యవస్థ శాటిలైట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పైలట్లకు ల్యాండింగ్ సమయంలో మార్గనిర్దేశం చేస్తుంది.
GAGAN క్షితిజ సమాంతర విమానంలో 1.5 మీటర్ల ఖచ్చితత్వాన్ని మరియు నిలువుగా 2.5 మీటర్ల ఖచ్చితత్వాన్ని అందించగలదు. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా [AAI] అనేక విమానాలను ఒకదాని తర్వాత ఒకటి ప్యాక్ చేయడానికి అనుమతిస్తుంది. కచ్చితత్త్వంతో కూడిన సమాచారం వల్ల ఇంధనం , సమయం ఆదా కావడమే కాకుండా, అనవసరమైన కార్బన్ ఉద్గారాల నుండి పర్యావరణాన్ని కూడా ఆదా చేస్తుంది.






