Telangana BJP: మున్సిపోల్స్ లో కమల దళం సరికొత్త వ్యూహం!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించి, స్థానిక సంస్థలపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న రాష్ట్ర నాయకత్వం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టణ ప్రాంతాల్లో తన పట్టు నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో తమకు బలం ఎక్కువగా ఉందని భావిస్తున్న బీజేపీ, ఈసారి పట్టణ ఓటింగ్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. సైలెంట్ ఓటింగ్ బీజేపీకి కలిసొస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. స్మార్ట్ సిటీలు, ఇతర పట్టణాభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వివరాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో (116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు) పట్టు సాధించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. 7 కార్పొరేషన్లలో కనీసం 5 గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. 116 మున్సిపాలిటీల్లో 50 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి డివిజన్, ప్రతి వార్డులో అభ్యర్థులను నిలబెట్టి బలమైన పోటీ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు నిర్ణయించారు.
“కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి” అనే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు ధీటుగా, అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని ప్రజలకు వివరించనున్నారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్, ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్నగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్లో జరిగే ప్రచార సభలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ ఇప్పటికే ఇన్చార్జులను, కో-ఆర్డినేటర్లను నియమించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, టీ-బీజేపీ ఎంపీలందరూ రాష్ట్రంలోనే ఉండి ప్రచారంలో పాల్గొనేలా జాతీయ నాయకత్వం నుండి అనుమతి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది కీలక పరీక్ష కావడంతో, బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
మొత్తానికి, పట్టణ ఓటర్ల నాడిని పట్టుకుని, కేంద్ర పథకాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలన్న బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలించి, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.






