Medaram: మేడారంలో నెట్వర్క్ జామ్.. సిగ్నల్ ఉన్నా కలవని ఫోన్లు.. అవస్థల్లో భక్తులు
ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే, జాతర ప్రాంగణంలో భక్తులు తీవ్రమైన నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వివిధ టెలికాం సంస్థలు జాతర కోసం సుమారు 40కి పైగా తాత్కాలిక మొబైల్ టవర్లను ఏర్పాటు చేసినప్పటికీ, అవి భక్తుల రద్దీకి సరిపోవడం లేదు.
సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కలవవు
ఫోన్లలో నెట్వర్క్ బార్స్ కనిపిస్తున్నా, కాల్స్ చేయడం కానీ, డేటా వాడటం కానీ సాధ్యం కావడం లేదు. టవర్ల సామర్థ్యానికి మించి వినియోగదారులు ఉండటమే దీనికి ప్రధాన కారణమని నెట్వర్క్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇంటర్నెట్ కోసం, ఫోన్ మాట్లాడటం కోసం భక్తులు ఎత్తైన భవనాలు, చెట్లపైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫోన్లు కలవకపోవడంతో బంధువుల నుంచి విడిపోయిన వారు ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ డెస్క్ కేంద్రాల్లోని అనౌన్స్మెంట్ సిస్టమ్‌పై ఆధారపడుతున్నారు.
గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు
సాంకేతిక ఇబ్బందులు ఒకవైపు ఉన్నా, ఆధ్యాత్మిక పరవశంలో భక్తులు మునిగితేలుతున్నారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకోగా, గురువారం చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క రాకతో మేడారం పులకించిపోయింది. సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొచ్చే క్రమంలో ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు.






