Delhi: దక్షిణాసియాలో అణ్వస్త్ర పోటీ.. రేసులో దూసుకెళ్తున్న భారత్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన చర్యలతో అణ్వస్త్ర పోటీకి తెరతీశారు. ప్రపంచదేశాలతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ట్రంప్.. వెనెజువెలాపై దాడి చేసి, అధినేత మదురో దంపతులను ఎత్తుకెళ్లారో.. అప్పుడే దేశాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు అణ్వస్త్ర సామర్థ్యం పెంపుపై ఫోకస్ పెట్టాయి. ఈదిశగా చైనా దూసుకెళ్తోంది. రష్యా, చైనాల నుంచి ముప్పుందని భావిస్తున్న అగ్రరాజ్యం.. తాను కూడా అణ్వస్త్ర సామర్థ్యానికి పదును పెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనలకు తెరలేపుతున్న తరుణంలో, దక్షిణాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అణు వార్హెడ్ల సమీకరణలో భారత్ తన పొరుగు దేశం పాకిస్థాన్‌ను అధిగమించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుండగా, అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) తాజా అంచనాల ప్రకారం, 2025 నాటికి భారత్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 180కి చేరింది. గతేడాది ఈ సంఖ్య 172గా ఉండగా, తాజాగా మరో 8 వార్హెడ్లను సమకూర్చుకుంది. అదే సమయంలో పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాల సంఖ్య 170 వద్దే స్థిరంగా ఉంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా (4,309), అమెరికా (3,700) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చైనా వద్ద 600 వార్హెడ్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా కూడా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో ఉన్నాయి.
పాకిస్థాన్‌తో పాటు ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లే భారత్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని సుదూర ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి క్షిపణులపై భారత్ దృష్టి సారించింది. ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించగల ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్స్’ (MIRV) టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, సంప్రదాయ సైనిక శక్తిలో తనకంటే పెద్దదైన భారత్‌ను నిలువరించడమే లక్ష్యంగా పాకిస్థాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య ఉన్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం వచ్చే వారం ఫిబ్రవరి 4తో ముగియనుంది. దీనికి ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో, గత 50 ఏళ్లలో ఇరు దేశాల మధ్య అణ్వాయుధాలపై ఎలాంటి పరిమితులు లేని పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి కానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త అణ్వస్త్ర పోటీకి దారితీయవచ్చని, ఇరు పక్షాల వ్యూహాత్మక ప్రణాళికలు “అనిశ్చితి, తీవ్ర పరిణామాల అంచనాల” ఆధారంగా నడిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






