Scot Bessent: భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా ఆక్రోశం..!
ట్రంప్ ఆంక్షలు, బెదిరింపుల వేళ భారత్ తో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం… అగ్రరాజ్యం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది.తాము చెప్పింది వింటూ.. తమ వెంటే నడిచిన యూరప్.. ఒక్కసారిగా రూటు మార్చేసరికి .. ట్రంప్ సర్కార్ తట్టుకోలేకపోతోంది. యూరోపియన్ దేశాలతీరుపై మండిపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తుంటే.. మీరు మాత్రం మీ వాణిజ్య ప్రయోజనాలకోసం భారత్ తో ఒప్పందం కుదుర్చుకుంటారా అని అగ్రరాజ్య ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒప్పందంపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య ప్రయోజనాలకే ఈయూ ప్రాధాన్యం ఇచ్చిందంటూ అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ మండిపడ్డారు. ‘‘వాళ్లకు ఏది ఉత్తమమైందో వారు అది చేయాలి. కానీ యూరోపియన్లు నన్ను చాలా నిరాశపరిచారు’’ అని అన్నారు.
రష్యా చముురు కొంటోందన్న సాకుతో అమెరికా…గతేడాది భారత దిగుమతులపై భారీగా సుంకాలు విధించింది. తమలాగే భారత్‌పై అదనపు సుంకాలు విధించేందుకు అప్పుడు ఈయూ విముఖత వ్యక్తం చేసిందని అమెరికా ఆర్థికమంత్రి బెసెంట్ గుర్తు చేశారు. సొంత వాణిజ్య ఒప్పందం కోసం ముందుకువెళ్లాలనే ఉద్దేశంతోనే, వారు ఆ పని చేసేందుకు ఇష్టపడలేదన్నారు. ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే యూరప్ అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
‘‘రష్యా చమురు భారత్‌కు వెళుతోంది. దాన్ని శుద్ధి చేసి భారత్ చమురు ఉత్పత్తులు తయారుచేస్తుంది. ఇప్పుడు యూరోపియన్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రష్యా యుద్ధానికి వారు పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నారు’’ అని బెసెంట్ ఆరోపించారు. ఈ వాణిజ్య ఒప్పందంపై బెసెంట్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ ప్రజల గురించి మాట్లాడే యూరప్ నేతలు, వాస్తవానికి వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అవసరమైతే తాము కూడా రష్యా చమురును కొనుగోలు చేసి చౌకైన ఇంధనం పొందవచ్చని, కానీ అలా చేయడానికి అమెరికా సిద్ధంగా లేదని బెసెంట్ వ్యాఖ్యానించారు.






