Donald Trump: క్యూబా టార్గెట్ గా ట్రంప్ ఆంక్షలు.. చమురు విక్రయించిన దేశాలపై టారిఫ్ బాదుడు..!
వెనెజువెలా అయిపోయింది. ఇప్పుడు క్యూబాపై కన్నేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ దేశానికి సంబంధించి చమురు ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు.
క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ (Donald Trump) తాజా చర్య మెక్సికో (Mexico)పై ఒత్తిడి పెంచనుంది. క్యూబా ప్రభుత్వం నుంచి దూరం కావాలని దానిపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ .. క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అమెరికా ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
వెనెజువెలా చమురు, డబ్బుపై క్యూబా చాలాకాలంగా ఆధారపడి ఉందని ఇటీవలే ట్రంప్ (Donald Trump) ఆరోపించారు. ఇది ఇకపై సాగదని.. ఇప్పుడు క్యూబాకు అక్కడి ఇంధనం గానీ, డబ్బుగానీ వెళ్లవని ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తమతో సత్వరం ఒప్పందం చేసుకోవడమే క్యూబాకు మంచిదన్నారు. అయితే.. ఆ ఒప్పందం ఏంటనేది మాత్రం స్పష్టం చేయలేదు.
‘‘పరస్పర గౌరవం, ప్రయోజనాలు, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా.. అమెరికా ప్రభుత్వంతో బాధ్యతాయుతమైన చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియజ్- కెనల్. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటంతోపాటు మా స్వాతంత్ర్యానికి గౌరవం ఇవ్వడం కూడా అవసరం. వలసల వ్యవహారంలో సాంకేతిక సంప్రదింపులు మినహా.. అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరగడం లేదు’’ అని క్యూబా అధ్యక్షుడు ఇటీవలే తేల్చి చెప్పారు. దీంతో క్యూబాపై ట్రంప్ ఆంక్షల కత్తి దూశారని చెప్పవచ్చు.






