Nizam: నిజాం నగల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన
హైదరాబాద్ రాజ్య చరిత్ర అంటేనే అంతులేని వైభవం. ఆ వైభవానికి తలమానికం ‘నిజాం ఆభరణాలు’. ఈ నగలు కేవలం రాచరికపు అలంకరణలు మాత్రమే కావు, అవి దక్కన్ సంస్కృతికి, మొఘలాయిల కాలపు కళా చాతుర్యానికి, గోల్కొండ వజ్రాల స్వచ్ఛతకు నిదర్శనాలు. తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ నిధికి సంబంధించిన లోతైన విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఈ నగలు అత్యున్నత దశకు చేరుకున్నాయి. 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత, తన వారసుల ఆర్థిక భద్రత కోసం నిజాం రెండు ప్రధాన ట్రస్టులను ఏర్పాటు చేశారు. ఒకటి 1951లో ఏర్పాటు చేసిన నిజాం జ్యువెలరీ ట్రస్ట్ కాగా రెండోది 1952లో ఏర్పాటు చేసిన నిజాం సప్లిమెంటరీ జ్యువెలరీ ట్రస్ట్. ఈ ట్రస్టులలోని 173 ఆభరణాలను విక్రయించకుండా, కేవలం నిజాం కుటుంబ వారసుల హక్కులను కాపాడేలా నిబంధనలు రూపొందించారు. అయితే, కాలక్రమేణా వారసుల మధ్య తలెత్తిన వివాదాలు, పన్ను సమస్యల వల్ల ఈ నిధిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1970వ దశకంలో నిజాం వారసులు ఈ నగల వేలానికి ప్రయత్నించగా, భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. “ఇవి దేశం గర్వించదగ్గ జాతీయ సంపద, వీటిని విదేశీయులకు విక్రయించకూడదు” అని కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ న్యాయపోరాటం 1995లో ముగిసింది. అప్పట్లో ఈ నగల విలువపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, నిజాం వారసులతో కుదిరిన ఒప్పందం ప్రకారం రూ. 218 కోట్లకు భారత ప్రభుత్వం వీటిని దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం, అప్పటి నుంచి ఈ నగలు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలోని అత్యంత సురక్షితమైన రహస్య గదుల్లో భద్రపరిచారు.
ఈ 173 నగల సేకరణలో కొన్ని ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి ఉన్నాయి. అందులో జాకబ్ డైమండ్ ఒకటి. ఇది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం. ఇది 184.75 క్యారెట్ల బరువు కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజాం తన టేబుల్‌పై దీనిని ఒక పేపర్ వెయిట్‌గా వాడేవారు. విక్టోరియా వజ్రం కంటే ఇది పెద్దది. ఇంకో ముఖ్యమైన ఆభరణం సత్లదా (Satlada). ఏడు వరుసల ముత్యాల హారం ఇది. ఇందులో ఉపయోగించిన ముత్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన ‘బస్రా’ ముత్యాలు. ఇక నిజాం ఖిల్వత్ అలంకరణలు కూడా పేరెన్నికగన్నవి. రాజులు ధరించే దస్తార్ (తలపాగా)పై అలంకరించే ‘సర్ పేంచ్’లు ఇవి. వీటిలో వజ్రాలు, పచ్చలు, కెంపులు అత్యంత నైపుణ్యంతో పొదగబడ్డాయి. ఇవేకాక కేవలం పురుషులకే కాకుండా, అంతఃపుర స్త్రీల కోసం రూపొందించిన భారీ కమ్మలు, పట్టీలు, ఉంగరాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో ఆభరణం వెనుక నెలల తరబడి శ్రమించిన కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది.
హైదరాబాద్ పౌరులు, చరిత్రకారులు ఈ నగలను శాశ్వతంగా హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో లేదా చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచాలని కోరుతున్నారు. నిజాం నగలు ఇక్కడ ఉంటే, హైదరాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇవి హైదరాబాద్ గడ్డపై పుట్టినవి. స్థానిక ప్రజలకు తమ పూర్వీకుల సంపదను చూసుకునే హక్కు ఉందని భావిస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా వీటి తరలింపుపై కేంద్రానికి లేఖలు రాశాయి.
అయితే వీటి తరలింపులో అనేక చిక్కుముళ్లు ఉన్నట్టి కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. వీటిని తరలించడం కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదన్నారు. 1995లో రూ. 218 కోట్లకు కొన్న ఈ నిధి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 50,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన సొత్తును రోడ్డు లేదా విమాన మార్గంలో తరలించడం అత్యంత సాహసోపేతమైన ప్రక్రియ. ఈ నగలను ప్రదర్శించే మ్యూజియంకు గాలి చొరబడని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, లేజర్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ రక్షణ అవసరం. అంతేకాక ఆర్బీఐ, భారత ప్రభుత్వాల మధ్య ఉన్న పాత ఒప్పందాలను సవరించాల్సి ఉంటుంది.
అయితే నిజాం నగల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తున్నామని కేంద్రం చెప్పడం ఒక ముందడుగు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌కు శాశ్వతంగా తరలించలేకపోతున్నామని చెప్పడం పట్ల చరిత్రకారుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో సాంకేతికత మరింత అభివృద్ధి చెంది, పటిష్టమైన భద్రతతో ఈ నిధి మళ్లీ భాగ్యనగరంలో ప్రదర్శించబడుతుందని ఆశిద్దాం.






