కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ అడుగులు? కీలక పదవుల కోసం మమత, అభిషేక్‌తో చర్చలు
TMC: బీజేపీ నుండి పెరుగుతున్న రాజకీయ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , ప్రతిపక్షాలను బలోపేతం చేయడానికి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సోనియా గాంధీ ప్రతిపాదించారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రముఖ నాయకుల నిష్క్రమణలు వంటి సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రతిపాదనపై వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆలోచించుకోవడానికి మమతా బెనర్జీ కొంత సమయం కోరినట్లు సమాచారం.
ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు..
ఈ విలీన ప్రక్రియ కోసం కాంగ్రెస్ ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం, మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని, అలాగే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనల గురించి ఇరు పార్టీల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
గంటన్నరకు పైగా సాగిన చర్చలు..
రాజకీయ ఉత్కంఠను రేపుతున్న ఈ పరిణామాల మధ్య, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ చర్చలు చాలా ఫలవంతంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని అభిషేక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఇటీవల ముగిసిన ఎన్నికల అనంతర పరిస్థితులపై, ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.








