మహిళా రిజర్వేషన్లు వారి హక్కు.. అది మేము ఇస్తున్న గిఫ్ట్ కాదు: ప్రధాని మోదీ
Narendra Modi: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. ఈ రోజును దేశ పార్లమెంట్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కేవలం చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచడమే కాకుండా, దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇస్తున్న కానుక కాదు..
“వికసిత్ భారత్ అంటే కేవలం మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైళ్లు మాత్రమే కాదు.. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణమవుతుంది” అని ప్రధాని స్పష్టం చేశారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు దేశ ప్రగతిలో అద్భుతాలు సృష్టిస్తారని, ఇప్పటికే రాజకీయాల్లో సామర్థ్యం కలిగిన మహిళలు ఎందరో ఉన్నారని ఆయన కొనియాడారు. చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న కానుక కాదని, అది వారి ప్రాథమిక హక్కు అని మోదీ వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ వల్ల నష్టం వాటిల్లదు..
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై వస్తున్న ఆందోళనలను ప్రధాని తోసిపుచ్చారు. మహిళా బిల్లును తెరపైకి తెచ్చి కొందరు ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజన రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. చిన్న, పెద్ద రాష్ట్రాలనే భేదం తమకు లేదని పేర్కొన్నారు.
అడ్డుకునే వారిని ఎప్పటికీ క్షమించరు..
ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయ పరమార్థం లేదని, ఇది కేవలం దేశ మహిళల ప్రయోజనాల కోసమే తెచ్చామని ప్రధాని వివరించారు. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కలను సాకారం చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. “ఈ బిల్లు క్రెడిట్ నాకు అవసరం లేదు, మీరే తీసుకోండి. అన్ని పార్టీల నేతలు తమ ఫోటోలు వేసుకోండి.. కానీ మహిళా హక్కుల కోసం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించండి” అని విపక్షాలకు పిలుపునిచ్చారు. బిల్లును అడ్డుకునే వారిని మహిళలు ఎప్పటికీ క్షమించరని, సమయం చూసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి








