ప్రధాని మోదీ బెంగాల్ లోనే, అమిత్ షా కూడా బెంగాల్ లోనే.. ఎందుకంటే..
బెంగాల్ లో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టి, మమతా బెనర్జీకి చుక్కలు చూపించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మొదటి దశ లో బీజేపీ భారీగానే ప్రచారం చేసింది. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహారాన్నంతా తమ భుజాలపైనే వేసుకున్నారు. తృణమూల్ పై, సీఎం మమతాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలకు దిగారు.
మరోవైపు మొదటి దశలో దాదాపు 90 శాతం పోలింగ్ జరిగింది. దీంతో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ఘంటాపథంగా చెబుతోంది. అయితే.. రెండో దశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ మరింత అలర్ట్ అయ్యింది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా బెంగాల్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే వుండిపోయారు. అక్కడి నుంచే ఎప్పటికప్పుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. అలాగే రెండో దశ పోలింగ్ పై కూడా వారందరితో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు ప్రధాని మోదీ కూడా ప్రస్తుతం బెంగాల్ లోనే పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హుగ్లీ నదిలో బోట్ రైడ్ కి వెళ్లారు. తన వెంట ఓ కెమెరాను కూడా తీసుకెళ్లారు. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అక్కడి నది అందాలను క్లిక్ అనిపించారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతితో ముడిపడి వుందని బెంగాల్ సెంటిమెంట్ ను తట్టిలేపారు. అంతేకాకుండా బెంగాలీల జీవితాల్లో గంగానదికి ప్రత్యేక స్థానం వుందని, దాని జలాలు ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తాయన్నారు. ఈ సందర్భంగా నదిలో పడవలు నడిపే వారితో, మార్నింగ్ వాక్ కి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు.
మరో వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్ లోనే తిష్ఠ వేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెుదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్నారు. రెండో దశలోనూ తామే ఎక్కువ సీట్లు నెగ్గుతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజీపీనే అంటూ ప్రకటించారు.మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. అందుకు మెుదటి దశలో 92.88 శాతం ఓటింగ్ నమోదు కావడమే నిదర్శనమన్నారు. బెంగాల్ ఓటర్లు అభివృద్ధిని ఎంచుకున్నారని తొలి దశ ఎన్నికలతో స్పష్టమైందని చెప్పుకొచ్చారు. బెంగాల్లో మార్పు కోసం ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారన్నారు. మహిళల రక్షణ బీజేపీ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించారంటూ ఎన్నికల సంఘం, స్థానిక పోలీసులు, భద్రతా దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఒక్కరి ప్రాణం కూడా పోకుండా జరిగిన బెంగాల్ ఎన్నికలు ఇవేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి






