Rajnath Singh: యుద్ధం సరిహద్దులు దాటింది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆధునిక కాలంలో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, నేటి యుద్ధాలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఓ సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. మారుతున్న జాతీయ భద్రతా సవాళ్లు, దేశ రక్షణలో యువత పాత్రపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సరికొత్త యుద్ధ రంగాలు..
శత్రు దేశాలు సైనికులతో భౌతికంగా దాడి చేయడమే కాకుండా, ఇప్పుడు కొత్త మార్గాల్లో దొంగదెబ్బ తీసే ప్రమాదం పొంచి ఉందని మంత్రి (Rajnath Singh) హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, సైబర్ (డిజిటల్) దాడులకు పాల్పడటం, ఇంధన, ఆహార భద్రతకు ఆటంకం కలిగించడం ద్వారా ఒక దేశాన్ని అంతర్గతంగా కుప్పకూల్చే వ్యూహాలు ప్రస్తుతం ప్రధాన ఆయుధాలుగా మారాయని ఆయన విశ్లేషించారు.
ఇలాంటి విపత్కర, అదృశ్య యుద్ధాలను దీటుగా ఎదుర్కోవాలంటే కేవలం సాయుధ దళాలు మాత్రమే సరిపోవని.. ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత మానసిక దృఢత్వంతో, అచంచలమైన క్రమశిక్షణతో దేశ రక్షణకు నిరంతరం సన్నద్ధమై ఉండాలని ఆయన (Rajnath Singh) పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
పౌరులు, సైన్యం బలమైన సమన్వయంతో అడుగులేసినప్పుడే దేశం సురక్షితంగా పురోగమిస్తుందని ఉద్ఘాటించారు. భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేస్తూ సాయుధ దళాలను కేంద్రం ఆధునికీకరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
యువత భాగస్వామ్యానికి కీలక అడుగులు..
దేశ భద్రతలో యువతను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రెండు కీలక నిర్ణయాలను రాజ్‌నాథ్ (Rajnath Singh) వెల్లడించారు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) ప్రవేశాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 17 లక్షలుగా ఉన్న ఎన్సీసీ క్యాడెట్ల సామర్థ్యాన్ని 20 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. సైనిక విద్యా విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాలో దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేశామన్నారు.
సైనిక రంగంలో ‘నారీ శక్తి’..
గతంలో మగవారికి మాత్రమే పరిమితమైన సైనిక పాఠశాలల్లోకి ఇప్పుడు బాలికలకు కూడా ప్రవేశం కల్పించడం ఒక చరిత్రాత్మక ముందడుగు అని మంత్రి (Rajnath Singh) అభివర్ణించారు. బాలికలు ఊహించిన దానికంటే అత్యుత్సాహంతో, పెద్ద సంఖ్యలో చేరుతుండటం దేశ ‘నారీ శక్తి’ ఎదుగుదలకు నిదర్శనమన్నారు. ఈ బాలికా క్యాడెట్లు సైనిక శిక్షణలో తమ అపార సామర్థ్యాలను నిరూపించుకుంటూ, భవిష్యత్తులో దేశానికి వివిధ రంగాల్లో అత్యుత్తమ నాయకులుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి








