CCS Meeting: ఇంధన సరఫరా పర్యవేక్షణకు మంత్రుల బృందం : సీసీఎస్ లో కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో ఇంధన సరఫరా పర్యవేక్షణ, ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. ఈ సందర్భంగా దేశంలో ఇంధన సరఫరా పర్యవేక్షణకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల కార్యదర్శులనూ తీసుకోవాలని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని ప్రధాని సూచించారు. నాలుగో వారంలోకి ప్రవేశించిన ఈ సంఘర్షణ ప్రభావం నుంచి తమ పౌరులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావాన్ని చూపుతుందని కూడా ఈ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.అయితే.. దీని ప్రభావం భారత్ పై ఎంత ప్రభావం చూపుతుందో, దాని విరుగుడుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
“ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో సహా సామాన్యుడి కీలక అవసరాల లభ్యతపై సమగ్ర అంచనా వేయబడింది. నిత్యావసరాల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలపై వివరంగా చర్చించారు’’ అని పేర్కొంది.అలాగే తక్షణ, దీర్ఘకాలిక, మధ్యకాలిక వ్యూహాలపై కూడా సమాలోచనలు జరిపారు.
ఇవి కూడా చదవండి
యుద్ధం వల్ల ప్రపంచమంతా ఒకే విధమైన ప్రభావం పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని రక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు నల్లబజారుకు వెళ్లిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కూడా చేసుకోవాలని నిర్ణయించారు.
అలాగే రైతుల సమస్యలు, వారిపై యుద్ధం ప్రభావంతో పాటు ఖరీఫ్ సీజన్ కి అవసరమైన ఎరువుల గురించి కూడా మాట్లాడారు. అలాగే విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు భారత్ లోని అన్ని విద్యుత్ కేంద్రాలలోని బొగ్గు నిల్వలపై కూడా ప్రధాని చర్చించారు.
’’పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ఉపశమన చర్యలను సమీక్షించడానికి సీసీఎస్ సమావేశానికి అధ్యక్షత వహించాను. రైతులకు ఎరువుల నిరంతర లభ్యతను నిర్ధారించడం, కీలక రంగాలకు దిగుమతి వనరులను వైవిధ్యపరచడం, కొత్త గమ్యస్థానాలకు ఎగుమతులను ప్రోత్సహించడం వంటి స్వల్ప, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలపై మేము విస్తృతంగా చర్చించాము. ఈ సంఘర్షణ ప్రభావం నుండి మన పౌరులను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాము.’’ అని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువులు, ఆరోగ్యమంత్రి నడ్డా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కార్మిక మంత్రి మాండవీయ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి








