రాహుల్కు హైకోర్టు షాక్.. పౌరసత్వంపై కేసు నమోదు!
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వంపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్పై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేపట్టాలని యూపీ పోలీసులను ఆదేశించింది.
బ్రిటీష్ పౌరసత్వం ఉందంటూ గతంలో పిటిషన్..
కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్, రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందంటూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ బ్రిటన్లో ‘బ్యాక్ ఆప్స్ లిమిటెడ్’ అనే కంపెనీకి డైరెక్టర్గా ఉన్నప్పుడు, తన జాతీయతను ‘బ్రిటీష్’గా పేర్కొన్నారని పిటిషనర్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటం (Dual Citizenship) నిషిద్ధం. ఒకవేళ విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే, వారి భారతీయ పౌరసత్వం , ఎంపీ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది.
కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేయాలి..
గతంలో కింది కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయగా, దానిని సవాల్ చేస్తూ విఘ్నేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. దేశ భద్రత , ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆరోపణలపై నిజానిజాలు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. రాయబరేలీలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో రాహుల్పై కేసు నమోదు చేయాలని, అవసరమైతే ఈ కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.








