Rahul Gandhi: రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి నాలుగు వారాల గడువు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పౌరసత్వంపై జరుగుతున్న వివాదంపై అలహాబాద్ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ వ్యవహారాన్ని గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. కేంద్రం కోరిన ఎనిమిది వారాల గడువుకు హైకోర్టు అంగీకరించకుండా, కేవలం నాలుగు వారాలే గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. గడువులోగా కేంద్రం తమ స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.
ఈ వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తూన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్‌లు.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్ పౌరుడని, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ కొన్నేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ బ్రిటన్‌లో నమోదైన కంపెనీకి డైరెక్టర్‌గా, సెక్రటరీగా ఉన్నారని, ఆ కంపెనీ వార్షిక నివేదికలో ఆయన తనను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, భారత పౌరుడిగా కొనసాగాలంటే వేరే దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని స్వామి తెలిపారు. రాహుల్ (Rahul Gandhi).. తన బ్రిటన్ పౌరసత్వాన్ని విడిచిపెట్టలేదని ఆయన ఆరోపించారు. విఘ్నేశ్ కూడా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని నిర్ధారించే యూకే ప్రభుత్వ రికార్డులు తన వద్ద ఉన్నాయని కోర్టుకు వివరించారు.