‘‘విలీన ప్రతిపాదన’’ తృణమూల్ నుంచే కోరుకుంటున్న కాంగ్రెస్.. అసలు రహస్యం ఇదీ..
ఇండియా కూటమి భేటీ నుంచి ఢిల్లీలో రాజకీయంగా పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్లుగా వున్న తృణమూల్ కాంగ్రెస్… ఇప్పుడు కాంగ్రెస్ కి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటగా.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తదనంతరం టీఎంసీ కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. దీంతో రాజకీయాలు మారుతాయన్న సంకేతాలను ఇద్దరు కీలక నేతలిచ్చారు.
తాము బలమైన కూటమిని కోరుకుంటున్నామని, ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామని తృణమూల్ ఆ సమావేశంలో స్పష్టం చేసింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని రెండు రోజులుగా బలంగా వార్తలు వస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ మనసులో ఏముందంటే.. ఆ ప్రతిపాదన మమతా బెనర్జీ నుంచే రావాలని కానీ.. తమంతట తాము ఈ ప్రతిపాదన తేమని, ఒత్తిడి కూడా చేయమని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
అయితే.. మమతా బెనర్జీ, సోనియా గాంధీ సమావేశానికి ముందు ఇద్దరూ ఒకరినొకరు ఆలింగం చేసుకున్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిని తృణమూల్ పార్టీ వారి మధ్య ఉన్న దీర్ఘకాల బంధానికి సంకేతంగా అభివర్ణించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బుధవారం నాడు రాహుల్ గాంధీ మరియు అభిషేక్ బెనర్జీల మధ్య జరిగిన సమావేశం, ఆ కూటమి ఇటీవల జరిపిన సమావేశం తర్వాత ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులలో భాగంగా జరిగింది. ఆ సమావేశంలో, బీజేపీని సవాలు చేయడానికి మరింత సమన్వయం మరియు ఐక్యత అవసరమని ప్రతిపక్ష నాయకులు నొక్కి చెప్పారు.
నిజానికి ఈ రెండు పార్టీలకూ ఓ చరిత్ర వుంది. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. పశ్చిమ బెంగాల్లో 2011లో వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ పార్టీలు కలిసి పనిచేశాయి, అయితే తర్వాతి ఏడాది వాటి పొత్తు విచ్ఛిన్నమైంది.
తరువాత, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వారు ‘ఇండియా’ (INDIA) కూటమిలో భాగస్వాములయ్యారు. సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమైన తర్వాత (ఆ సమావేశంలో రాహుల్ గాంధీ లేనప్పటికీ), ఆ పార్టీల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందన్న ఊహాగానాలు తలెత్తాయి.ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.








