మళ్లీ వార్తల్లోకి గెహ్లాట్.. నాలుగేళ్ల కిందటి విషయంతో…
రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మళ్లీ వార్తల్లో నిలిచారు. తాను రాజస్థాన్ సీఎంగా వున్న సమయంలో, యువనేత సచిన్ పైలట్ మధ్య ప్రతి రోజూ వార్ నడిచేది. దీంతో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచేవారు. ఎప్పుడైతే సీఎం కుర్చీ నుంచి దిగిపోయారో, అప్పటి నుంచి కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా… మళ్లీ గెహ్లాట్ వార్తల్లో నిలిచారు. అది కూడా నాలుగు సంవత్సరాల క్రితం నాటి వార్తతో.
2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అప్పగించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే గెహ్లాట్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని భావించినట్టు ప్రచారం జరగడం, అనంతర పరిణామాలతో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే తనపై కుట్ర జరిగిందని, నాటి పరిణామాలే తనను కాంగ్రెస్ అధ్యక్షుడిని కాకుండా అడ్డుకున్నాయని అశోక్ గెహ్లాట్ తాజాగా వెల్లడించారు. ‘సోనియాగాంధీ, కాంగ్రెస్ కలిసి నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే నేను కాదనేవాడినా?’ అని ప్రశ్నించారు.
పండిట్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నేతలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారనీ, తనను పార్టీ అధ్యక్షుడిగా సోనియాగాంధీ, కాంగ్రెస్ నియమించి ఉంటే కాదనేవాడినా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు ఖాయం అని అనుకుంటున్న సమయంలో తనపై కుట్ర జరిగిందని గెహ్లాట్ అన్నారు. అకస్మాత్తుగా పార్టీ కేంద్ర పరిశీలకులు వచ్చారనీ, అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయని అన్నారు. తాను రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదని, కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని వద్దనుకుంటున్నానని ప్రచారం జరిగిందని, జనంతో పాటు తన సన్నిహితులు, మద్దతుదారులు కూడా అదే నమ్మారని అన్నారు.దీంతో పరోక్షంగా సచిన్ పైలట్ పై విమర్శలు చేశారు.
“కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి బదులుగా ముఖ్యమంత్రిగానే కొనసాగాలని నేను కోరుకోవడం వల్లే ఆ తిరుగుబాటు జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని వారికి ఎలా వివరించాలి?” అని ఆయన అన్నారు.సెప్టెంబర్ 25, 2022న హైకమాండ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు జరగలేదని గెహ్లాట్ స్పష్టం చేశారు; అంతేకాకుండా, ఇందిరా గాంధీ కాలం నుంచే రాజస్థాన్ కాంగ్రెస్‌కు కేంద్ర నాయకత్వం పట్ల విధేయత ప్రదర్శించే సంప్రదాయం ఉందని ఆయన పేర్కొన్నారు.








