రాహుల్ గాంధీకి భారీ ఝలక్.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఆయనకు ద్వంద్వ పౌరసత్వం వుందని వస్తున్న ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరం వుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వమే స్వయంగా విచారణ జరపాలని, లేదా దర్యాప్తు నిమిత్తం ఈ విషయాన్ని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థకైనా అప్పగించాలని హైకోర్టు లక్నో ధర్మాసనం ఆదేశించింది.
బీజేపీ నాయకుడు విగ్నేష్ శిశిర్, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్ ను లక్నోలోని ప్రత్యేక ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు జనవరి లో తిరస్కరించిందని, ఈ ఉత్తర్వుల్ని హైకోర్టులో సవాల్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ సమయంలో పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని కింది కోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
అయితే.. హైకోర్టులో విచారణ జరిపిన తర్వాత.. తన పిటిషన్ ను హైకోర్టు అనుమతించిందని, ద్వంద్వ పౌరసత్వ కేసు విషయంలో రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించిందని శిశిర్ పేర్కొన్నారు. ఇదో చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. దేశ భద్రత దృష్ట్యా, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం చాలా కీలకమన్నారు.
“ఒక చారిత్రాత్మక మరియు మైలురాయి తీర్పులో, లక్నో బెంచ్‌లోని గౌరవనీయ అలహాబాద్ హైకోర్టు నా పిటిషన్‌ను అనుమతించి, లోక్‌సభ పార్లమెంట్ సభ్యుడు మరియు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై బ్రిటిష్ పౌరసత్వ కేసులో మొదటి సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా, కోత్వాలి పోలీస్ స్టేషన్‌ను ఆదేశించింది,” అని ఎక్స్ వేదికగా బీజేపీ నేత శిశిర్ రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే…
రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి వున్నారని ప్రధాన ఆరోపణ. అంటే ఓ వైపు భారత పౌరునిగాను, మరోవైపు బ్రిటీష్ పౌరునిగాను వున్నారని ఆరోపణ. ఏ వ్యక్తి అయినా కేవలం ఒకే దేశం పౌరసత్వాన్ని కలిగి వుండాలన్నది భారత చట్టం చెబుతోంది. ఒకవేళ ఎవరైనా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి వుంటే మాత్రం వారు భారత దేశ ఎన్నికలలో పోటీ చేయడానికి గానీ, పార్లమెంట్ సభ్యునిగా కొనసాగడానికి గానీ అనర్హులు అవుతారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో, రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాహుల్ ద్వంద్వ పౌరసత్వంతో వున్నారని, అందుకే ఈ ఎన్నిక చట్ట విరుద్ధమని శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి








