దీదీకి భారీ షాక్… ఎన్డీయేలో చేరాలని 20 మంది ఎంపీల నిర్ణయం
బెంగాల్ లో మమతా బెనర్జీ పరాభవం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేయడం ప్రారంభమైపోయింది. చాలా మంది సీనియర్లు పార్టీకి రాజీనామా చేయడమో, బీజేపీలో చేరిపోవడమో చకచకా జరిగిపోతున్నాయి. దీంతో మమతా బెనర్జీ తీవ్ర ఇరకాటంలో పడిపోయారు.
తాజాగా.. బెంగాల్ లో ఓడిపోవడంతో ఇండియా కూటమి ద్వారా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్నారు. మమతా బెనర్జీ ఈ సమావేశంలో వుండగానే.. తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
తాము ఎన్డీయేలో చేరుతామని, ఇందుకు అనుమతి కావాలని కోరుతూ కనీసం 20 మంది అసమ్మతి ఎంపీలు సోమవారం ఏకంగా లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని ఈ వర్గానికి కాకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహించనున్నారు.
లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. పార్టీలో చీలిక రావాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఈ సంఖ్య 19 గా వుంది. టీఎంసీలోని ఒక అసమ్మతి వర్గం తమకు 20 మంది ఎంపీల మద్దతు ఉందని పేర్కొంది.లోక్సభలో తమ నాయకుడిగా అభిషేక్ బెనర్జీ కాకుండా కాకోలి ఘోష్ ఉండాలని ఈ తిరుగుబాటు ఎంపీలు కోరుతున్నారు.
బీజేపీ అసమ్మతి ఎంపీలు ఢిల్లీలో బెంగాల్ సీఎం సువేందు అధికారితో పాటు, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ నేత విప్లవ్ దేవ్ తో కూడా భేటీ అయ్యారు. సువేందు నివాసంలోనే ఈ కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో 14 మంది తృణమూల్ ఎంపీలు పాల్గొన్నారు.








