Iran Uranium: ఇరాన్ ‘అణు’ నిల్వలపై అమెరికా కన్ను.. 400 కిలోల యురేనియం స్వాధీనమే లక్ష్యం!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అణు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న సుమారు 400 కిలోల అత్యున్నత స్థాయి (60 శాతం) శుద్ధి చేసిన యురేనియంపై (Iran Uranium) ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రధానంగా దృష్టి సారించింది. అణ్వాయుధాల తయారీకి దాదాపు సరిపోయే స్థాయిలో ఈ యురేనియం శుద్ధి చేసి ఉండటంతో వాషింగ్టన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రమాదకర అణు సామగ్రిని ఇరాన్ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.
యురేనియం అప్పగిస్తేనే..
యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ తన యురేనియం (Iran Uranium) నిల్వలను అప్పగించాలనే కఠిన నిబంధనను తెరపైకి తేవాలని అమెరికా యోచిస్తోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి తన వ్యూహాలను, లక్ష్యాలను మార్చుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో మాత్రం అత్యంత స్థిరమైన వైఖరితో ఉన్నారు. కేవలం ఇరాన్ వద్దే కాకుండా, ఆ దేశ రాజకీయ మిత్రపక్షాల వద్ద కూడా ఎలాంటి అణు మెటీరియల్ (Iran Uranium) ఉండకూడదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఒకవేళ శాంతి చర్చల ద్వారా ఇరాన్ యురేనియం అప్పగించేందుకు అంగీకరించకపోతే, సైనిక బలగాలను ప్రయోగించి ‘బలవంతంగా’ స్వాధీనం చేసుకునే ప్రత్యామ్నాయాన్ని కూడా అమెరికా అధిష్ఠానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పరోక్ష చర్చలు.. నేరుగా మంతనాలు నిల్
ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ల మధ్య నేరుగా ఎలాంటి ముఖాముఖి చర్చలు జరగడం లేదు. పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం మాత్రమే ఈ రెండు దేశాల మధ్య పరోక్ష మంతనాలకు మధ్యవర్తిత్వం వహిస్తోంది. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు పశ్చిమాసియాకు భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరిస్తూ అమెరికా ఇరాన్‌పై (Iran Uranium) మానసిక, సైనిక ఒత్తిడిని పెంచుతోంది.
టార్గెట్ ఖార్గ్ ద్వీపమా?
ఇప్పటికే 3,500 మంది మెరైన్లను ఆ ప్రాంతానికి పంపిన పెంటగాన్.. తాజాగా వందల సంఖ్యలో కమాండోలు, ఆర్మీ రేంజర్లు, అత్యంత ప్రమాదకర ఆపరేషన్లలో పాల్గొనే ‘నేవీ సీల్స్’ను కూడా పశ్చిమాసియాకు తరలిస్తున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ స్పెషల్ ఫోర్సెస్‌ను వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఉపయోగిస్తారా? లేక ఇరాన్ చమురు గుండెకాయ అయిన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ‘సీక్రెట్ ఆపరేషన్’కు వాడుతారా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అణ్వాయుధ సామగ్రి రక్షణ, చమురు స్థావరాల భద్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








