West Asia: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. విధ్వంసం ఇంకా మొదలే కాలేదు!
Donald Trump: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్లో అసలైన విధ్వంసం ఇంకా ప్రారంభం కాలేదని, పరిస్థితి మరింత చేయిదాటకముందే లొంగిపోవాలని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఘాటైన పోస్టులు పెట్టారు.
అమెరికా సైన్యమే అత్యంత శక్తిమంతం:
ప్రపంచంలోనే అమెరికా సైన్యం అత్యంత గొప్పదని, అత్యంత శక్తిమంతమైనదని ట్రంప్ కొనియాడారు. తమ సైన్యం ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదని, ఇరాన్లో మిగిలి ఉన్న కీలక వనరులను ధ్వంసం చేయడం ఇంకా మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఒప్పందానికి రావాలని సూచన:
ఇరాన్ తన ఉనికిని పూర్తిగా కోల్పోకముందే ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచించారు. ఇరాన్‌లోని కొత్త నాయకత్వానికి పరిస్థితి అర్థమవుతోందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని బెదిరించారు. ఇప్పటికే ఇరాన్‌లోని అతిపెద్ద వంతెనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. భవిష్యత్తులో దాడులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరించారు. రానున్న వారాల్లో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.








