Donald Trump: ఓటర్ల జాబితాపై ట్రంప్ సంతకం.. అమెరికా ఎన్నికల్లో కొత్త రూల్స్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల వివరాలతో కూడిన ‘నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్’ ను రూపొందించేలా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల దృష్ట్యా, ఓటింగ్ ప్రక్రియపై మరిన్ని ఆంక్షలు విధించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
కీలక నిర్ణయాలు :
జాతీయ జాబితా రూపకల్పన: హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ప్రతి రాష్ట్రంలోనూ అర్హులైన ఓటర్ల జాబితాను అధికార యంత్రాంగం తయారు చేయనుంది.
బార్కోడ్ ఎన్వలప్‌లు: బ్యాలెట్ పేపర్లను ట్రాక్ చేసేందుకు వీలుగా ప్రత్యేకమైన బార్కోడ్లు కలిగిన సురక్షితమైన ఎన్వలప్‌లను వాడాలని ట్రంప్ నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
మెయిల్-ఇన్ ఓటింగ్‌పై నియంత్రణ: రాష్ట్రాలు ఆమోదించిన అధికారిక జాబితాలో పేరు లేని వారికి యూఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా ‘ఆబ్సెంటి బ్యాలెట్లను’ పంపకుండా నిరోధించాలని ట్రంప్ యోచిస్తున్నారు. తద్వారా మెయిల్-ఇన్ ఓటింగ్ విధానాన్ని పూర్తిగా నియంత్రించాలన్నది ఆయన వ్యూహం.
న్యాయపరమైన సవాళ్లు:
అయితే, రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో అధ్యక్షుడి జోక్యం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘సెంటర్ ఫర్ ఎలక్షన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్’ అధినేత డేవిడ్ బెకర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో కూడా ఎన్నికల నియంత్రణ కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు ఓటర్ల హక్కులను హరించేందుకు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా డెమోక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఈ ఎత్తుగడ అని ఆరోపిస్తూ, దీనిపై కోర్టుకు వెళ్తామని ప్రకటించారు.
ట్రంప్ కలల ప్రాజెక్టుకు బ్రేక్.. బాల్రూమ్ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశం:
డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాల్రూమ్’ నిర్మాణానికి ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈస్ట్ వింగ్ విభాగంలో జరుగుతున్న ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని జడ్జి ఆదేశించారు.
కోర్టు వివాదం:
చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్‌లోని నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని దాటారని ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్’ దావా వేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం.. పురాతన కట్టడాల పరిరక్షణ దృష్ట్యా నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించిన బాల్రూమ్ పనులకు ఇలా బ్రేక్ పడటం ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది.
ఇవి కూడా చదవండి








