అమెరికా, ఇరాన్ యుద్ధం.. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న చమురు సంక్షోభం
హైదరాబాద్: ఎక్కడో దూరంగా ఉన్న గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం మన ఇంటి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం యుద్ధ క్షేత్రానికే పరిమితం కాకుండా, చమురు ధరలు రూపాయి విలువ రూపంలో మన దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ముఖ్యమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ప్రాంతంలో స్వల్ప అలజడి రేగినా, అది భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా దెబ్బకొడుతుంది.
రూపీ బలహీనం..
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి తమ నిధులను వెనక్కి తీసుకుంటారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల డాలర్ విలువ పెరిగి భారత రూపాయి బలహీనపడుతుంది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మాత్రమే కాదు. రవాణా, విమానయానం, పెయింట్లు, టైర్లు కెమికల్స్ వంటి పెట్రోలియం ఆధారిత పరిశ్రమలన్నింటిలోనూ ఖర్చులు పెరుగుతాయి. ఈ భారమంతా చివరికి వినియోగదారుడి పైనే పడుతోంది.
ఇవి కూడా చదవండి
బంగారం ధరల పెరుగుదల..
ఈ సంక్షోభం స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీలను విక్రయించడం వల్ల మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మరోవైపు చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వ్యాపార పెట్టుబడులను కూడా కుంటుపరుస్తుంది. అయితే ఈ అనిశ్చితి సమయంలో బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. సురక్షితమైన ఆస్తిగా భావించి అందరూ బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడమే దీనికి కారణం.
భారత దౌత్యనీతి..
ఎన్నారైల విషయానికి వస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల వారు పంపే డాలర్లకు ఇండియాలో ఎక్కువ విలువ లభిస్తుంది. కానీ పెరిగిన ధరల వల్ల ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యుల ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం తన దౌత్యనీతితో ఒక గొప్ప విజయాన్ని సాధించింది. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, రెండు భారతీయ ఎల్పీజీ (LPG) నౌకలు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటగలిగాయి. భారతదేశం అనుసరిస్తున్న తటస్థ విదేశాంగ విధానం వల్లే ఇది సాధ్యమైంది. గల్ఫ్ యుద్ధం కేవలం అక్కడికే పరిమితం కాకుండా చమురు మార్కెట్ల ద్వారా నేరుగా మన ఇంటి వంటగది వరకు చేరుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








