Ali Mohammad Nayini: ఇరాన్‌కు మరో బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నేత బలి!
Iran Israel War : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ తన కీలక సైనికాధికారులను ఒక్కొక్కరిగా కోల్పోతోంది. తాజాగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతినిధి, జనరల్ అలీ మహమ్మద్ నయినీ ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో మరణించారు. శత్రు దేశాలను హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నయినీ మరణాన్ని ఐఆర్జీసీ అధికారికంగా ధ్రువీకరించింది.
సవాలు విసిరిన గంటల్లోనే..
మరణించడానికి కేవలం కొన్ని గంటల ముందే నయినీ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
క్షిపణి సామర్థ్యంపై ధీమా: ఇరాన్‌కు యురేనియం శుద్ధి చేసే శక్తి లేదన్న నెతన్యాహు వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ.. తమ క్షిపణి పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని, యుద్ధ సమయంలోనూ ఉత్పత్తిని కొనసాగిస్తున్నామని నయినీ స్పష్టం చేశారు. “శత్రువులకు మరిన్ని సర్ప్రైజ్లు ఎదురుకానున్నాయి” అని ఆయన హెచ్చరించారు.
ట్రంప్‌కు సవాలు: ఇరాన్ నౌకాదళం ధ్వంసమైందన్న ట్రంప్ ప్రకటనను కొట్టిపారేస్తూ.. ధైర్యముంటే పర్షియన్ గల్ఫ్‌లోకి అమెరికా నౌకలను పంపాలని సవాలు విసిరారు. అయితే ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే ఆయన ఇజ్రాయెల్ దాడులకు బలైపోయారు.
వరుసగా కీలక అధికారుల మృతి:
ఇరాన్‌కు ఈ వారం అత్యంత భారంగా మారింది. ఇప్పటికే అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీలను ఇరాన్ కోల్పోయింది. ఇప్పుడు నయినీ మరణంతో ఇరాన్ సైనిక యంత్రాంగం ఆత్మరక్షణలో పడింది.








