బాబాయ్ టిఫిన్ స్టైల్లో వెన్నతో కాల్చిన ఘాటైన నెల్లూరు కారం దోశ.. ఇలా చేసుకుని తినండి!
ఉదయం టిఫిన్‌కి దోశ తినడం చాలామందికి ఇష్టం. కానీ ప్రతిరోజూ ఒకే రకమైన దోశ కాకుండా కాస్త ఘాటుగా, కరకరలాడుతూ, వెన్న సువాసనతో ఉండే దోశ తినాలనిపిస్తే నెల్లూరు వెన్న కారం దోశను ప్రయత్నించండి. ఇది నెల్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా ఇష్టపడే టిఫిన్లలో ఒకటి. దోశపై కారంపేస్ట్, వెన్న కలిసినప్పుడు వచ్చే రుచి, సువాసన దీనికి ప్రత్యేకతను తీసుకొస్తాయి. సరైన పిండితో, పెనంపై సరైన మంటలో కాల్చుకుంటే బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ దోశను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
దోశ పిండి, ఎర్ర కారం ఇలా సిద్ధం చేయండి

ఒక కప్పు మినపప్పు, మూడు కప్పుల బియ్యం, పావు కప్పు పచ్చి శనగపప్పు, రెండు టీస్పూన్ల మెంతులు, అర కప్పు అటుకులు తీసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగి సుమారు 3–4 గంటలు నానబెట్టాలి.
నానిన పదార్థాలను కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా కాస్త గట్టిగా ఉండేలా చూసి, రాత్రంతా లేదా 8 గంటల పాటు పులియనివ్వాలి. ఇక ఎర్ర కారం కోసం రెండు ఉల్లిపాయలు, 4–6 ఎండుమిరపకాయలు, 3–4 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు తీసుకుని మిక్సీలో కచ్చాపచ్చాగా లేదా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
వెన్న కారం దోశ ఎలా వేయాలంటే..

పెనాన్ని బాగా వేడి చేసి, మంటను మీడియంలోకి తగ్గించాలి. ఒక గరిటెడు దోశ పిండిని తీసుకుని పలుచగా గుండ్రంగా పరిచి, అంచుల చుట్టూ కొద్దిగా వెన్న వేయాలి.
దోశపై ఒక చెంచా ఎర్ర కారం పేస్ట్‌ను పలుచగా సమానంగా పూయాలి. ఆ తర్వాత మరో చెంచా తాజా వెన్నను వేసి దోశ మొత్తం కరిగేలా చేయాలి. వెన్నతో దోశకు మంచి సువాసన, రుచి వస్తుంది.
ఇవి కూడా చదవండి
కారం పేస్ట్‌ను మరీ ఎక్కువగా వేయకుండా పలుచగా పూస్తే దోశలో కారం, వెన్న రుచులు బ్యాలెన్స్‌గా ఉంటాయి. దోశ అంచులు కాస్త ఎర్రగా మారి, కరకరలాడటం మొదలయ్యే వరకు మీడియం మంటపైనే కాల్చాలి.
క్రిస్పీగా కాల్చి ఇలా సర్వ్ చేయండి

దోశను వెంటనే తిప్పకుండా మీడియం మంటపై కింద భాగం బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు కాల్చాలి. ఈ దోశను సాధారణంగా తిప్పకుండా మడిచి తీస్తే బయట క్రిస్పీగా, లోపల కారం-వెన్న రుచితో ఉంటుంది.
వెన్న కారం దోశను పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఎర్ర కారం, వెన్న రుచి ఎక్కువగా ఆస్వాదించాలంటే వేడివేడిగా తినడమే బెస్ట్.








