పొరపాటున డబ్బులు పంపామంటూ కొత్త మోసం.. ఎస్బీఐ కీలక హెచ్చరిక
SBI Fraud Warning : మీ బ్యాంక్ ఖాతాలోకి ఎవరైనా తెలియని వ్యక్తులు పొరపాటున డబ్బులు పంపించారా? అయితే జాగ్రత్త! అది సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, మీ అకౌంట్‌ను ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పెద్ద వ్యూహం కావచ్చు. ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ సరికొత్త ‘జంప్డ్ డిపాజిట్ స్కామ్’ (Jumped Deposit Scam) పట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. సాంకేతిక లోపాల కంటే.. ప్రజల అమాయకత్వాన్ని , నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని డిజిటల్ పేమెంట్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఈ మోసం ఎలా జరుగుతుందంటే?
ఎస్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, నేరగాళ్లు ఈ మోసాన్ని కొన్ని దశల్లో పక్కా ప్లాన్‌తో అమలు చేస్తారు. కేటుగాళ్లు ముందుగా కావాలనే బాధితుల ఖాతాలోకి కొంత తక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ లేదా మెసేజ్ చేసి, తాము పొరపాటున ఆ డబ్బు పంపామని నమ్మిస్తారు. అవతలి వ్యక్తి ఎంతో మర్యాదగా లేదా తాము తీవ్రమైన ఆందోళనలో, అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లు నటిస్తూ ఆ డబ్బును వెంటనే తిరిగి పంపాలని బతిమాలుతారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. బాధితులను నేరుగా తమ నంబర్‌కు డబ్బు పంపమని అడగకుండా, యూపీఐ (UPI) ద్వారా ‘కలెక్ట్ రిక్వెస్ట్’ లేదా ‘పేమెంట్ అప్రూవల్ లింక్’ పంపుతారు. బాధితులు కేవలం తమకు వచ్చిన డబ్బును తిరిగి వెనక్కి ఇస్తున్నామని భావించి, ఎలాంటి వివరాలు సరిచూసుకోకుండా ఆ రిక్వెస్ట్‌ను ఆమోదించి పిన్ నంబర్ నొక్కుతారు. కానీ, ఆ లావాదేవీ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తానికి జరిగి, క్షణాల్లో అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇతరుల పొరపాటును సరిదిద్దాలనే మానవత్వపు ఆలోచననే మోసగాళ్లు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఇది పాస్వర్డ్లు, ఓటీపీలు అడిగే పాత పద్ధతి కాకుండా, బాధితులే స్వయంగా లావాదేవీని అప్రూవ్ చేసేలా ఉచ్చు బిగిస్తారు కాబట్టి డబ్బులు ఖచ్చితంగా పోతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
పొరపాటున డబ్బు పంపామని చెప్పే గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి తొందరపడవద్దని ఎస్బీఐ ప్రజలకు సూచించింది. మీ బ్యాంకింగ్ యాప్ లేదా స్టేట్మెంట్ ద్వారా ఆ లావాదేవీ నిజంగా జరిగిందో లేదో చెక్ చేయండి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టత లేకపోతే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే చేయవద్దు. అత్యవసరంగా స్పందించాలని ఒత్తిడి చేస్తే అస్సలు పట్టించుకోవద్దు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి. డబ్బు స్వీకరించడానికి (ఆదాయానికి) యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బు పంపేటప్పుడు మాత్రమే పిన్ కొట్టాలి.
వెంటనే ఫిర్యాదు చేయండి..
ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే వీలైనంత త్వరగా ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లాలి. త్వరగా స్పందిస్తేనే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఎస్బీఐ వివరించింది.








