Email: ఆ మెయిల్స్ విషయంలో జాగ్రత్త..!
ఇటీవలి కాలంలో స్పాం కాల్స్, మెసేజెస్ విషయంలో సామాన్యుల్లో ఆందోళన కనపడుతోంది. తాజాగా కేంద్ర ఆదాయపు పన్ను శాఖ పేరుతో అందుకున్న ఈమెయిల్స్ విషయంలో ఆందోళన నెలకొన్న నేపధ్యంలో కీలక ప్రకటన చేసింది. ఆదాయపు పన్ను శాఖ(Income Tax), పన్ను చెల్లింపుదారులకు కీలక విజ్ఞప్తి చేసింది. అడ్వాన్స్ ట్యాక్స్(Advance Tax) ఇ-క్యాంపెయిన్ కింద పంపిన కొన్ని ఈమెయిల్ లలో తప్పుడు సమాచారం ఉందని పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ పంపిన ఈమెయిల్ లలో పన్ను చెల్లింపుదారులకు సంబంధం లేని లేదా తప్పుడు లావాదేవీల వివరాలు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది.
ఒకే రకమైన భారీ లావాదేవీలకు సంబంధించిన సమాచారం, సంబంధం లేని వ్యక్తులకు వెళ్ళడంతో.. ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత చెల్లింపులకు మార్చి 15 చివరి తేదీ. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేయడానికి పంపిన ‘నడ్జ్’ సందేశాలలో ఈ లోపం తలెత్తినట్లు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. తప్పుడు వివరాలతో అందిన ఈమెయిల్ లను దయచేసి విస్మరించాలని కోరింది. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి విచారిస్తున్నామని ఐటీ శాఖ తన అధికారిక ఎక్స్(X) ఖాతాలో పేర్కొంది.
ఈ మెయిల్ లు కేవలం రిమైండర్లు మాత్రమేనని, ఇవి ఎటువంటి చట్టపరమైన నోటీసులు కావని అధికారులు స్పష్టం చేశారు. ఈమెయిల్లో వచ్చిన తప్పుడు అంకెలను కాకుండా, మీ సొంత లెక్కలు, లావాదేవీల ఆధారంగానే అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించి చెల్లించాలని కేంద్రం కోరింది. అనుమానం ఉంటే.. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీ ఏఐఎస్ (Annual Information Statement) లో చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఇలాంటి గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్ లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐటీ శాఖ ఎప్పుడూ పాస్వర్డ్ లేదా ఓటీపీ అడగదని గుర్తుంచుకోవాలని, సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి








