ఐదేళ్ల ముందే పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే ఈ పన్ను భారం తప్పదు
EPFO : భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారుల దశాబ్దాల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకునే ప్రక్రియను అత్యంత సులభతరం చేస్తూ ‘ఈపీఎఫ్ఓ 3.0’ (EPFO 3.0) ద్వారా యూపీఐ, ఏటీఎంల ద్వారా నేరుగా నగదును డ్రా చేసుకునే డిజిటల్ విప్లవానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, ఈ సాంకేతిక వెసులుబాటుతో డబ్బులు సులువుగా వచ్చేస్తున్నాయి కదా అని ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకుంటే మాత్రం భారీగా ఆదాయ పన్ను రూపంలో నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సొంత బ్యాంకు ఖాతాలోకి బదిలీ..
భవిష్యత్తులో పీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ద్వారా మొబైల్ స్క్రీన్‌పైనే బ్యాలెన్స్ చూసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో యూపీఐ పిన్ ఉపయోగించి పీఎఫ్ నిధులను సొంత బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం రానుంది. ఈ సాంకేతికతకు సంబంధించిన ప్రయోగ దశ దాదాపు పూర్తయిందని, త్వరలోనే చందాదారులకు ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా, అత్యవసరాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మానవ ప్రమేయం లేకుండా కేవలం 3 రోజుల్లోనే డబ్బులు ఖాతాలో పడే ‘ఆటో సెటిల్మెంట్’ పరిమితిని కూడా సంస్థ ఇటీవల రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. అయితే, మొత్తం సొమ్మును ఒకేసారి యూపీఐ ద్వారా వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో (ఉద్యోగి, యాజమాన్య వాటా కలిపి) 50 శాతం నుండి 75 శాతం వరకే విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు. భవిష్యత్తు ఆర్థిక భద్రత దృష్ట్యా కనీసం 25 శాతం నిధిని ఖాతాలోనే ఉంచాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఐదేళ్ల లోపు విత్‌డ్రాలపై పన్ను ముప్పు..
సాధారణంగా ఈపీఎఫ్ పెట్టుబడులకు, వాటిపై వచ్చే రాబడికి, వెనక్కి తీసుకునేటప్పుడు పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, ఐదేళ్ల నిరంతర సర్వీసు పూర్తి కాకుండానే పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకుంటే మాత్రం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ సర్వీస్ కాలాన్ని కొత్త కంపెనీ సర్వీస్‌తో కలపాలంటే పాత బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేసి ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఈపీఎఫ్ చందా రూ. 2.5 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీకి ఐదేళ్ల నిబంధనతో సంబంధం లేకుండా పన్ను పడుతుంది. ఒకవేళ యాజమాన్యం వాటా లేకుండా కేవలం ఉద్యోగి మాత్రమే చందా చెల్లిస్తుంటే ఈ పన్ను రహిత పరిమితి రూ. 5 లక్షల వరకు ఉంటుంది.
పన్ను పడని ప్రత్యేక సందర్భాలు ..
కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఐదేళ్ల లోపు డబ్బులు ఉపసంహరించుకున్నా పన్ను పడదు. ఈపీఎఫ్ నుండి తీసుకున్న డబ్బుతో కలిపి, మీ మొత్తం ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితిని దాటకపోతే పన్ను వర్తించదు. ఉద్యోగి తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు, సంస్థ వ్యాపారాన్ని మూసివేసినప్పుడు లేదా మీ నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల (ఉద్యోగం కోల్పోవడం వంటివి) డ్రా చేసుకుంటే పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద మీ ఈపీఎఫ్ నగదు నిల్వ మొత్తాన్ని జాతీయ పెన్షన్ పథకం (NPS) లోకి బదిలీ చేసినా పన్ను ఉండదు.
10 శాతం టీడీఎస్..
సెక్షన్ 192ఎ ప్రకారం, మీరు వెనక్కి తీసుకునే మొత్తం రూ. 50,000 దాటి, ఆ ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తే మాత్రమే మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధిస్తారు. రూ. 50,000 లోపు తీసుకునేటప్పుడు టీడీఎస్ వర్తించదు. ఒకవేళ అనారోగ్యం, వ్యాపారం మూసివేత తదితర కారణాలతో వెనక్కి తీసుకుంటే, ఆ మొత్తం రూ. 50,000 దాటినా టీడీఎస్ ఉండదు. ఈ పరిధిలోకి రాని ఉపసంహరణలపై నిర్దేశించిన షరతులకు లోబడి సాధారణంగా 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.
యూపీఐ, ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్ వెనక్కి తీసుకునే ప్రక్రియ అందుబాటులోకి వచ్చినా.. అత్యవసరమైతే తప్ప ఈ సౌకర్యాన్ని వినియోగించుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు మారినప్పుడు పాత ఖాతాలోని డబ్బును ముందస్తుగా తీసుకోవడానికి బదులుగా, ఆ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీకి చెందిన ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవడమే ఉత్తమం. దీనివల్ల మీ సర్వీసు నిరంతరాయంగా కొనసాగి, ఐదేళ్ల పన్ను మినహాయింపు నిబంధనలను సులభంగా చేరుకోవచ్చు.








