ఎలాన్ మస్క్‌కు కేంద్రం షాక్.. భద్రతా కారణాలతో ‘స్టార్‌లింక్’ సేవలకు బ్రేక్
భారతదేశ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తుందనుకున్న ‘శాటిలైట్ ఇంటర్నెట్’ సేవలకు ఆరంభంలోనే భారీ అవరోధం ఏర్పడింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఉపగ్రహాల ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో భారత మార్కెట్లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ‘స్టార్‌లింక్’ (Star Link) సేవలకు అవసరమైన తుది అనుమతులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా సంస్థలు తాత్కాలికంగా నిలిపివేశాయి.
పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్లో జరిగిన పరిణామాలు భారత అధికారులను తీవ్రంగా అప్రమత్తం చేశాయి. ఇరాన్లో స్టార్‌లింక్ (Star Link) సంస్థకు ఎలాంటి చట్టబద్ధమైన అధికారిక లైసెన్స్ లేదు. అయినప్పటికీ ఆ దేశంలో స్టార్‌లింక్ టెర్మినల్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు వినియోగంలోకి రావడం కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థల దృష్టికి వచ్చింది. ఈ సంఘటన భారత భద్రతా యంత్రాంగాన్ని పునరాలోచనలో పడేసింది. భవిష్యత్తులో దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినా, లేదా అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు ఎదురైనా.. పూర్తిస్థాయిలో అమెరికా యాజమాన్య నియంత్రణలో నడిచే విదేశీ శాటిలైట్ నెట్‌వర్క్‌ను భారత ప్రభుత్వం ఎలా కట్టడి చేయగలదన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
వాస్తవానికి స్టార్‌లింక్ (Star Link) సంస్థ భారత్‌లో కార్యకలాపాలకు సంబంధించి కీలక అడుగులు వేసింది. దాదాపు ఏడాది క్రితమే ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్’ (GMPCS) లైసెన్స్‌ను కూడా దక్కించుకుంది. సేవలను పంపిణీ చేసేందుకు వీలుగా ముంబైలో ఒక భారీ మెయిన్ హబ్‌ను నిర్మించడంతో పాటు, దేశవ్యాప్తంగా 10 గేట్వేలను సన్నద్ధంగా ఉంచింది. అయినప్పటికీ జాతీయ భద్రతకు సంబంధించి లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకూ సేవలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
మరోవైపు, వ్యాపారపరంగా చూస్తే స్టార్‌లింక్ (Star Link) మాతృసంస్థ ‘స్పేస్ఎక్స్’కు ఇది ఒక గడ్డుకాలం. చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ఈ నెల 12వ తేదీన నాస్డాక్ (NASDAQ) మార్కెట్లో లిస్టింగ్ అయ్యేందుకు స్పేస్ఎక్స్ సన్నాహాలు చేసింది. సరిగ్గా ఈ మెగా ఈవెంట్‌కు ముందు, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ఇలా బ్రేకులు పడటం ఎలాన్ మస్క్‌కు వ్యూహాత్మకంగా భారీ ఎదురుదెబ్బేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రం విధించిన ఈ కఠిన నిబంధనల సెగ కేవలం స్టార్‌లింక్‌కు (Star Link) మాత్రమే తగలలేదు. దేశీయ టెలికాం దిగ్గజాలైన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ జియో’, సునీల్ మిట్టల్‌కు చెందిన ‘భారతీ ఎయిర్టెల్’ శాటిలైట్ విభాగాలు సైతం ప్రభుత్వ అత్యున్నత స్థాయి తనిఖీలను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశీయ సంస్థలు సైతం శాటిలైట్ సేవల కోసం యూరోపియన్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు కుదుర్చుకున్నాయి. యూజర్ల డేటా భద్రత, ఆ డేటాను దేశీయ సర్వర్లలోనే భద్రపరచడం (స్థానిక స్టోరేజ్), అత్యవసర సమయాల్లో మొత్తం నెట్‌వర్క్‌ను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకునే అవకాశం… తదితర కీలక అంశాలపై పూర్తిస్థాయిలో రాతపూర్వక హామీలు లభించే వరకూ శాటిలైట్ ఇంటర్నెట్ (Star Link) రంగంలో ఇసుమంతైనా రాజీపడే ప్రసక్తే లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.








