Union Budget 2026: ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. రవాణా, మౌలిక వసతులు, గ్రామీణ ఉపాధి కల్పన ద్వారా బెంగాల్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేలా ఈ పద్దును రూపొందించారు.
సరుకు రవాణా కారిడార్: పశ్చిమ బెంగాల్‌లోని డాంగ్కునిని గుజరాత్‌లోని సూరత్‌తో అనుసంధానించే కొత్త ‘ప్రెయిట్ కారిడార్’ (సరుకు రవాణా మార్గం) ఏర్పాటు చేయనున్నారు. ఇది వ్యాపారులకు రవాణా ఖర్చులను తగ్గించి, తూర్పు భారతాన్ని పశ్చిమ భారత్‌తో వేగంగా అనుసంధానిస్తుంది.
మౌలిక సదుపాయాల నిధి: దేశాభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12.2 లక్షల కోట్లను కేటాయించారు. ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ మౌలిక వసతులు, గృహనిర్మాణం, మెరుగైన రోడ్లపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుంది.
చిన్న పరిశ్రమలకు ఊతం: ఎంఎస్ఎంఈల కోసం రూ. 10,000 కోట్లతో ‘SME గ్రోత్ ఫండ్’ను ప్రకటించారు. ఇది స్టార్టప్‌లకు, చిన్న తయారీదారులకు ప్రోత్సాహకాలను అందించి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.
గ్రామ స్వరాజ్ చొరవ: చేనేత, హస్తకళాకారులను ఆదుకునేందుకు ‘మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా బెంగాల్‌లోని సాంప్రదాయ వస్త్రాలు, ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించనున్నారు.
జల రవాణా: రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయనున్నారు. ఇవి రోడ్లపై ఒత్తిడిని తగ్గించి, తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహిస్తాయి.
ఈ కేటాయింపులు పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక విప్లవానికి బాటలు వేస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.






