US: అమెరికా ఆర్థిక ఆధిపత్యం మరో 250 ఏళ్లు నిలవాలంటే..
మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ చేసిన సూచనలు ఇవే…
ఈ ఏడాదికి అమెరికా స్వాతంత్య్రం పొంది 250 ఏళ్లు పూర్తవుతోంది. ఈ రెండున్నర శతాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక చిన్న వ్యవసాయ ఆధారిత దేశం నుంచి ప్రపంచాన్ని శాసించే అతిపెద్ద ఆర్థికరాజ్యంగా అమెరికా ఎదిగింది. అయితే వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం, పడిపోతున్న జననాల రేటు తదితర పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించగలదా? ఈ కీలక ప్రశ్నకు సమాధానంగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ‘మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట’ ఒక సమగ్రమైన, లోతైన నివేదికను “ఎట్ 250: సస్టైనింగ్ అమెరికాస్ కాంపిటీటివ్ ఎడ్జ” పేరిట విడుదల చేసింది. గతం, వర్తమానం, భవిష్యత్తు.. ఈ మూడు కోణాల్లో అమెరికా ఆర్థిక పోటీతత్వాన్ని ఈ రిపోర్ట్ విశ్లేషించింది.
ప్రస్తుత ఆధిపత్యం.. గణాంకాలే సాక్ష్యం
ప్రపంచ జనాభాలో కేవలం 4 శాతం మాత్రమే ఉన్న అమెరికా.. నేడు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో ఏకంగా 26 శాతం వాటాను తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రపంచంలోని టాప్-100 అత్యుత్తమ, అత్యంత విలువైన కంపెనీల్లో 59 కంపెనీలు అమెరికాకు చెందినవే కావడం ఆ దేశ కార్పొరేట్ బలానికి నిదర్శనం. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గత కొన్నేళ్లుగా అమెరికాలో కార్మికుల ఉత్పాదకత అనూహ్యంగా పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, పరిశోధన-అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధుల్లో 27 శాతం ఒక్క అమెరికాలోనే ఖర్చవుతుండటం గమనార్హం.
ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్
అమెరికా ఎప్పుడూ ఒకే రకమైన ఆర్థిక మోడల్‌కు కట్టుబడిపోలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ వ్యవసాయం, పారిశ్రామికం, సైన్స్, డిజిటల్.. ఇలా నాలుగు చారిత్రక దశలను విజయవంతంగా దాటుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏఐ రూపంలో రాబోయే ఐదో దశకు సిద్దమవుతోంది. మెకిన్సే నివేదిక ప్రకారం, 1776వ సంవత్సరం నుంచి నేటి వరకు ప్రపంచ రూపురేఖలను మార్చేసిన 100 అత్యంత కీలకమైన ఆవిష్కరణలలో (స్టీమ్‌బోట్ నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు, ఎలక్ట్రికల్ గ్రిడ్ నుంచి నేటి జనరేటివ్ ఏఐ వరకు) ఏకంగా 76 ఆవిష్కరణలు అమెరికన్ల చేతుల మీదుగా లేదా వారి అండతోనే రూపుదిద్దుకున్నాయి. అలాగే ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే తలసరి వ్యవసాయ భూమి రెట్టింపు స్థాయిలో ఉండటం, సుమారు 200 ఏళ్ల పాటు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అమెరికాకు ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద వరాలు.
పొంచి ఉన్న ముప్పులు
గతం ఘనంగా ఉంది కాబట్టి అమెరికా భవిష్యత్తు కూడా పూలపాన్పు అవుతుందని చెప్పలేమని మెకిన్సే నివేదిక హెచ్చరిస్తోంది. ఆసియా దేశాల నుంచి తీవ్రమవుతున్న పోటీ, పడిపోతున్న సంతానోత్పత్తి రేటు వంటివి రాబోయే రోజుల్లో పెద్ద ముప్పుగా మారనున్నాయి. ఒకప్పుడు అమెరికాకు బలంగా ఉన్న అంశాలే ఇప్పుడు అంతర్గత భారంగా మారుతున్నాయి. దెబ్బతింటున్న దేశ ఆర్థిక ఆరోగ్యం, శిథిలావస్థకు చేరుకుంటున్న మౌలిక సదుపాయాలు, పడిపోతున్న విద్యా ప్రమాణాలు, తయారీ రంగంలో నైపుణ్యాల లేమి, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆదాయ, సంపద అసమానతలు.. ఇవన్నీ భవిష్యత్తు తరాలకు పెను సవాళ్లు. దీనికి తోడు అమెరికా జాతీయ అప్పు జీడీపీలో 120 శాతాన్ని మించిపోయింది. ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం వడ్డీల చెల్లింపులకే ఆవిరవుతోంది.
భవిష్యత్తు కోసం నాలుగు మెట్లు
అమెరికా తన అగ్రస్థానాన్ని భవిష్యత్తులోనూ కాపాడుకోవాలంటే ప్రధానంగా వ్యవస్థాగతమైన కీలక మార్పులు చేయాలని మెకిన్సే నివేదిక స్పష్టం చేసింది. అందులో ముఖ్యమైనవి..
ఏఐ నైపుణ్యం ఉన్న వర్క్‌ఫోర్స్ : రాబోయే దశాబ్దాల్లో ఉత్పాదకత పెరగాలంటే ఏఐ పాత్ర కీలకం. అయితే ఆటోమేషన్‌కు తగ్గట్టుగా కార్మికుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి. కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అన్వయించుకునే నైపుణ్యాలు పెంచేలా ప్రాథమిక (కె-12) విద్యావ్యవస్థను, కరిక్యులమ్‌ను సమూలంగా ఆధునికీకరించాలి.
ఆర్థిక, పెట్టుబడి క్రమశిక్షణ: అమెరికాకు ఉన్న అతిపెద్ద బలం డాలర్ ఆధిపత్యం, లోతైన క్యాపిటల్ మార్కెట్లు. అయితే అప్పుల భారం భారీగా పెరిగిపోవడం ఆందోళనకరం. ప్రైవేట్ పెట్టుబడులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఉత్పాదకతను పెంచే, భవిష్యత్తును నిర్మించే రంగాల్లోకి నిధులను మళ్లించాలి.
ఏఐ యుగానికి తగిన ఇంధన వనరులు: డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీ, వాహనాల ఎలక్ట్రిఫికేషన్ కారణంగా రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగనుంది. 2040 నాటికి ఈ డిమాండ్ ఏకంగా 60 శాతం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ల ఆధునికీకరణ, న్యూక్లియర్ (అణు విద్యుత్), పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెంచాలి. త్వరితగతిన పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి. ఇంధన వ్యూహమే ఇప్పుడు అమెరికాకు అత్యంత ప్రధానమైన పారిశ్రామిక వ్యూహంగా మారనుంది.
మౌలిక సదుపాయాల ఆధునికీకరణ: రైల్వేలు, ఇంటర్‌స్టేట్ హైవేలు, ఫైబర్ ఆప్టిక్స్.. ఇవన్నీ గతంలో అమెరికా పోటీతత్వాన్ని అమాంతం పెంచాయి. కానీ ప్రస్తుతం మౌలిక రంగంలో పెట్టుబడుల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో.. రోడ్లు, పోర్టులు తదితర మౌలిక వసతులను శరవేగంగా అభివృద్ధి చేయాలి. ఫెడరల్, స్టేట్ ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలి.
“అమెరికా ఎప్పటికీ ప్రపంచాన్ని ముందుండి నడిపించాలని ఎక్కడా రాసిపెట్టి లేదు.. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, సంస్థలను, మౌలిక వసతులను, టాలెంట్‌ను ప్రక్షాళన చేస్తూ రావడం వల్లే ఈ 250 ఏళ్ల ఆధిపత్యం సాధ్యమైంది” అని మెకిన్సే నివేదికను రూపొందించిన సీనియర్ ఫెలో రెబెక్కా జె. ఆండర్సన్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో కూడా ఈ ఆధిపత్యం కొనసాగాలంటే కేవలం సాంకేతికత ఉంటే సరిపోదు. సామాన్యుడికి అందుబాటులో వస్తువులు, నాణ్యమైన ఉద్యోగాలు, వ్యాపార సంస్థల రిస్క్ తీసుకునే సామర్థ్యం పెంపొందించాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వం.. ఈ మూడు పక్షాలు సమిష్టిగా కృషి చేసినప్పుడే అమెరికా ఆర్థిక భద్రత, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతాయంటూ మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తన నివేదికను ముగించింది.
కర్టెసీ: ఫోర్బ్స్ మ్యాగజైన్, మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్








